మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కల్యాణ్ మధ్య ఉన్న రిలేషన్ పై గత కొన్నేళ్లుగా అనేక వార్తలు పుట్టుకొచ్చాయి. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తరువాత నుంచి, పవన్, అన్నయ్య చిరంజీవికి దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే.. ఇది రాజకీయ విభేదమే తప్పా, వ్యక్తిగతం కాదని ఇద్దరు పలు సందర్బాల్లో చెప్పారు. చిరు సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన నేపధ్యంలో అన్న దమ్ముల మధ్య రిలేషన్ మళ్లీ వార్తల్లో నిలిచింది. చాలా గ్యాప్ తరువాత చిరంజీవి సినిమా చెయ్యడం.. దానికి పవన్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది.
అయితే.. ఇదంత పెద్ద విషయం కాదంటూ స్వయంగా చిరంజీవి చెప్పారు. ఈనేపధ్యంలో తాజాగా చిరంజీవి చెప్పిన ఓ విషయం ఆసక్తికరంగా మారింది. తమ ఫ్యామిలీతో పవన్ అనుబంధాన్ని గురించి ఎవరితో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదని, ఎప్పుడూ అది అద్భుతంగానే ఉంటుందని చెప్పాడు మెగాస్టార్. ఇటీవల ఇంట్లో ఓ స్పెషల్ కూర చేశారని, అది పవన్‌కు చాలా ఇష్టమైన కూర అని, దీంతో రామ్‌చరణ్ పర్సనల్‌గా వెళ్లి ఆ కర్రీని పవన్‌కు ఇచ్చి వచ్చాడని వెల్లడించాడు.
తమ అనుబంధం అంత మంచిగా ఉంటుందని, అలాంటి విషయాలను ప్రతి రోజూ అందరికీ చెప్పలేం కదా అని వివరించాడు చిరు. అయితే.. ఆ కర్రీ పవన్‌కు చాలా ఇష్టమని చెప్పిన మెగాస్టార్.. ఆ కర్రీ ఏంటనేది మాత్రం చెప్పలేదు. డిసెంబర్ లో తమ తండ్రి ఆబ్దీకానికి కూడా మెగా బ్రదర్స్ ఇద్దరు కలుసుకున్న విషయం తెలిసిందే. ఆ రోజు స్వయంగా పవన్ చిరంజీవి ఇంటికి వెళ్లి ఒక పూటంతా అక్కడే గడిపాడు. దీని బట్టి చూస్తుంటే మెగా బ్రదర్స్ రిలేషన్ విషయంలో ఇంకా ఎలాంటి డౌట్స్ లేవని అర్ధమైపోతుంది.