ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కోర్టు మెట్లెక్కారు. ఈ విషయాన్ని ప్రముఖ సినీ విశ్లేషకుడు రమేశ్ బాల ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. నిబంధనలకి విరుద్ధంగా తమ సినిమాలోని కథని కాపీ కొట్టి ‘రాబ్తా’ చిత్రాన్ని తీశారని ఆరోపిస్తూ ‘మగధీర’ నిర్మాతలు అల్లు అరవింద్, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారన్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, కృతి సనన్‌లు హీరోహీరోయిన్లుగా నటిస్తున్న రాబ్తా సినిమాపై మగధీర నిర్మాతలు కోర్టులో కేసు వేశారని తెలిపారు.
మగధీర సినిమాను కాపీ కొట్టేసి, సినిమా హక్కులను కొనుగోలు చేయకుండానే ఫ్రీమేక్ అంటూ తీసేస్తున్నారని, తద్వారా కాపీరైట్స్‌ను ఉల్లంఘించారని మగధీర నిర్మాతలు పేర్కొన్నట్టు రమేశ్ బాల వివరించారు. కాబట్టి రాబ్తా సినిమా విడుదలను నిలిపివేయాల్సిందిగా నిర్మాతలు కోర్టును కోరినట్టు వెల్లడించారు.
వారి వాదనలు విన్న హైదరాబాద్ కోర్టు రాబ్తా నిర్మాతలకు నోటీసులు ఇచ్చిందని, జూన్ 1కి తదుపరి విచారణను వాయిదా వేసిందని తెలిపారు. ఈ కోర్టు కేసుతో జూన్ 9న రాబ్తా సినిమా విడుదలవుతుందో లేదోనని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
దినేశ్ విజన్ డైరెక్షన్‌లో రూపుదిద్దుకుంటున్న రాబ్తా సినిమా ట్రైలర్ ఇప్పటికే విడుదలైంది. సినిమా ట్రైలర్ విడుదలకు ముందు నుంచీ మగధీర సినిమాను పోలి ఉంటుందన్న ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మగధీర నిర్మాతలు కోర్టుకు వెళ్లినట్టు తెలుస్తోంది.