మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 బుధవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. చిరుకు ఇది 150వ సినిమా కావడం..దాదాపు 9 ఏళ్ల తర్వాత మెగాస్టార్ వెండితెర రంగ ప్రవేశం చేయడం ఖైదీపై భారీ అంచనాలు నెలకొనేలా చేసింది. దీంతో ఖైదీని ఎప్పుడెప్పుడు వెండితెరపై చూస్తామనే ఆతృతే అభిమానులు హద్దు మీరేలా చేసింది. తమ అభిమాన హీరో సినిమా ప్రదర్శన ఆలస్యం కావడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ థియేటర్‌పై దాడికి దిగారు. ఈ ఘటన గుంటూరు జిల్లా కొల్లూరులో చోటుచేసుకుంది.
చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 చిత్రం బెనిఫిట్ షో వేస్తామని శ్రీనివాస థియేటర్ యాజమాన్యం తెలిపింది. అయితే బుధవారం తెల్లవారుజాము వరకూ బెనిఫిట్ షో వేయకపోవడంతో అభిమానులు రెచ్చిపోయారు. థియేటర్‌లోని కుర్చీలతో పాటు స్క్రీన్‌ను ధ్వంసం చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీఛార్జ్ చేశారు. మొదట ఖైదీ సినిమా బెనిఫిట్ షో ను అర్దరాత్రి ఒకటి గంటల ప్రాంతంలో వేసేందుకు థియేటర్ యజమానులు సిద్ధమైపోయారు. కానీ ఏపీ ప్రభుత్వం దీనికి అనుమతి నిరాకరించింది. అర్ధరాత్రి అయితే ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని ..తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో షో వేసుకోవాల్సిందిగా సూచించింది. దీంతో బెనిఫిట్ షో కోసం అర్ధ్రరాత్రే థియేటర్ కు చేరుకున్న అభిమానులు..షో ఆలస్యం కావడంతో థియేటర్ పై దాడికి దిగారు. ఇలాంటి ఘటనలు మరో రెండు మూడు థియేటర్ల లో కూడా చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.