తెలంగాణ సాంస్కృతిక వైభవం బతుకమ్మ పండగ దేశవిదేశాల్లోనూ ఖ్యాతిని ఆర్జిస్తోంది. ఖండంతరాల్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి, అమెరికాలోని న్యూజెర్సీలో బుధవారం బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. అమెరికాలోని ప్రవాస తెలంగాణ మహిళలు బతుకమ్మ పండుగను కన్నులపండువగా నిర్వహించారు. బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎంపీ కవిత 9 దేశాల్లో బంగారుబతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. అమెరికాలో బే ఏరియాలో బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన కవితకు ఎన్నారైలు ఘన స్వాగతం పలికారు.
కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్‌లో రాయల్ ప్యాలెస్ బతుకమ్మ ఆటా పాటకు వేదికైంది. ఎంపీ కవిత అక్కడి మహిళలతో కలిసి వివిధ రకాల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి.. ఆడిపాడారు. గౌరీదేవికి ప్రతిరూపమైన బతుకమ్మకు ఎంపీ కవిత పూజలు చేశారు. వేద టెంపుల్ పూజారుల మంత్రొఛ్చారణల మధ్య ఆమెతో పాటు ఇతర ప్రతినిధులు భక్తిశ్రద్ధలతో మొక్కుకున్నారు. కవితతో కలిసి ఉత్సాహంగా కోలాటం ఆడారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కవిత ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపింది. అరవై ఏండ్లుగా జరగని అభివృద్ధి కెసిఆర్ నాయకత్వంలో జరిగిందన్నారు. టీఆర్‌ఎస్-యుఎస్‌ఏ కార్యకర్తలను అభినందిస్తూ చాలా చురుగ్గా పని చేస్తూ ప్రభుత్వ పథకాలకు విస్తృత ప్రచారం కలిపిస్తున్నారన్నారు. బే ఏరియా విచ్చేసిన సందర్బంగా టీఆర్ఎస్ నేతలు కవితకు జ్ఞాపికను బహుకరించారు. ఈ కార్యక్రమంలో నేతలు బైరి పూర్ణచందర్, భాస్కర్ మద్ది, రజినీకాంత్ కొసనం, శ్రీనివాస్ పొన్నాల, నవీన్ జలగం, అభిలాష్ రంగినేని పాల్గొన్నారు. సుమారు 250 పైగా ఎన్నారైలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.