తెలంగాణతో మీషో ఒప్పందం.. కేటీఆర్‌ హర్షం..

116
Meesho signs MoU with Telangana
- Advertisement -

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) సదస్సులో పాల్గొనేందుకు స్విట్జ‌ర్లాండ్‌కు వెళ్లిన మంత్రి కేటీఆర్ బిజీబిజీగా గ‌డుపుతున్నారు. దావోస్‌లో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోరం స‌ద‌స్సులో భాగంగా తెలంగాణలో పెట్టుబడుల‌కు ఉన్న అవ‌కాశాల‌ను కేటీఆర్ వివ‌రిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ప‌లు కంపెనీలు ఆస‌క్తి చూపిస్తున్నారు. ఈ స‌ద‌స్సులో రెండో రోజైన సోమ‌వారం తెలంగాణ బృందం స‌త్తా చాటింది. సోమ‌వారం ఒకే రోజు రెండు సంస్థ‌ల‌తో తెలంగాణ ప్ర‌భుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇప్ప‌టికే అంత‌ర్జాతీయ బీమా సంస్థ స్విస్‌రేతో ఒప్పందం కుదుర్చుకున్న తెలంగాణ… తాజాగా ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ మీషోతో రెండో ఒప్పందాన్ని కుద‌ర్చుకుంది. మీషో సీఈఓ విదిత్ ఆత్రేయని మంత్రి కేటీఆర్ స్వాగతించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ ద్వారా ఈ విషయం వెల్లడించారు.

తాజా ఒప్పందం ప్ర‌కారం మీషో సేవ‌లు ఇక‌పై తెలంగాణ‌లోని ద్వితీయ శ్రేణి ప‌ట్ట‌ణాల‌కు కూడా విస్త‌రించ‌నున్నాయి. ఈ మేర‌కు త్వ‌ర‌లోనే మీషో సంస్థ హైద‌రాబాద్‌లో త‌న కార్యాల‌యాన్ని ప్రారంభించ‌నుంది. ఇప్ప‌టిదాకా ఈ సంస్థ సేవ‌లు న‌గ‌రాల‌కు మాత్ర‌మే ప‌రిమితమ‌య్యాయి. తెలంగాణ ప్ర‌భుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేర‌కు రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి ప‌ట్ట‌ణాల‌కు కూడా ఈ సంస్థ సేవ‌లు అంద‌నున్నాయి. ఈ మేర‌కు తెలంగాణ ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స‌మ‌క్షంలో మీషో సంస్థ‌, రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌ధ్య ఒప్పందం కుదిరింది. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, తెలంగాణ ప్రభుత్వ చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ అమర్‌నాథ్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -