ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చినప్పుడే దేశం సరైన మార్గంలో పయనిస్తుందని తన అభిమానులతో సమావేశమైస సంధర్బంగా రజనీకాంత్ అన్నారు. అలాగే యుద్ధం ఆరంభమయ్యేనాటికి మనమంతా సిద్ధంగా ఉందామని అభిమానులకు పిలుపునివ్వడం ద్వారా తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెప్పకనే చెప్పారు రజనీ. మరోవైపు రజనీ రాజకీయాల్లోకి రావద్దంటూ కొందరు.. రజనీ రాజకీయాల్లోకి రావాలని.. వస్తే సొంత పార్టీ ఏర్పాటు చేయాలని ఆయన అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా రజనీకాంత్ స్వాతంత్ర్య దినోత్సవం రోజున పార్టీపై విస్పష్ట ప్రకటన చేయనున్నారని, ఇప్పటికే పార్టీ జెండా (గుర్తు) తయారైందని తమిళ మీడియా పేర్కొంటోంది. ఈ మేరకు రజనీకాంత్ ఒక సీనియర్ జర్నలిస్టును తన రాజకీయ సలహాదారుగా నియమించుకున్నారని కూడా మీడియా కథనాలు చెబుతున్నాయి. రజనీ రాజకీయ ప్రవేశంపై కసరత్తు చేసిన టీమ్, పార్టీ సిద్ధాంతాల తయారీపై దృష్టి సారించిందని సమాచారం.
ఇక రజనీకాంత్ పార్టీ ప్రారంభించగానే వివిధ పార్టీల నుంచి ద్వితీయశ్రేణి నాయకత్వం చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అయితే అలాంటి వారిలో బలమైన నేతలను పార్టీలో చేర్చుకునేందుకు ఇప్పటికే రాయబారాలు సాగినట్టు సమాచారం. కాగా, రజనీకాంత్ కొత్త పార్టీకి హీరోయిన్లు మీనా, నమితలు మద్దతు తెలిపారు. ఇంకా పార్టీ ప్రకటించకముందే… తాము ఆయన పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. అయితే రజనీకాంత్ మాత్రం ఆచితూచి అడుగేయాలని.. ఒక్కసారి రాజకీయాల్లోకి వస్తే ఎదురయ్యే సమస్యలు, పరిణామాలపై బేరీజు వేసుకుంటున్నారు.