ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కొందరు ఎమ్మెల్యేల వ్యవహారశైలిపై కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా రెబల్స్ అంశాన్ని సమర్థంగా నియంత్రించలేకపోయిన తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
రెబల్ అభ్యర్థుల కారణంగా ప్రతిపక్ష పార్టీలకు లాభం చేకూరిందని మీనాక్షి నటరాజన్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. పార్టీ నేతల మధ్య సరైన సమన్వయం లేకపోవడంతో గెలవాల్సిన స్థానాల్లో కూడా పరాజయం పాలయ్యామని ఆమె అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇది పార్టీకి తీరని నష్టాన్ని కలిగించిందని నేతలకు ఆమె స్పష్టంగా చెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వరంగల్, నల్గొండ, పాలమూరు ప్రాంతాలకు చెందిన కీలక నేతలపై ప్రత్యేకంగా ఆమె దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆయా జిల్లాల ఎమ్మెల్యేల తీరును ఉదాహరణగా చూపిస్తూ, భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె కఠినంగా హెచ్చరించినట్లు సమాచారం.
మొత్తంగా 18 నియోజకవర్గాల్లో పార్టీ నేతల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన మీనాక్షి నటరాజన్, ఇకపై పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టంగా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో పార్టీ క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, సమిష్టిగా పనిచేసినప్పుడే విజయాలు సాధ్యమవుతాయని ఆమె నేతలకు దిశానిర్దేశం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Also Read:శ్రీశైలంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్

