ఎటువంటి పక్కా రోడ్లు లేని నగర శివారు ప్రాంతాల్లో రూ. 170 కోట్లతో 300 కిలోమీటర్ల పొడవున కొత్త సిసి రోడ్లు మంజూరు చేసినట్లు నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. సోమవారం జిహెచ్‌ఎంసి కార్యాలయంలో జిహెచ్‌ఎంసి ప్రాజెక్ట్స్, మెయింటనెన్స్ ఇంజనీరింగ్ అధికారులు, సి.ఆర్.ఎం.పి ఏజెన్సీలతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో మాట్లాడుతూ.. భవిష్యత్‌లో కొత్త పైప్‌లైన్లు, కేబుల్స్ ఇతర పనులు చేపట్టేందుకు అనువుగా రోడ్డు మధ్యలోనే ఈ సిసిరోడ్లను నిర్మించాలని అధికారులకు స్పష్టం చేశారు. సి.ఆర్.ఎం.పి కింద అప్పగించిన 709 కిలోమీటర్ల రోడ్ల నిర్వహణ బాధ్యత పూర్తిగా ఆయా ఏజెన్సీలదేనని తెలిపారు. వర్షకాలం వచ్చినందున ఎక్కడపడితే అక్కడ తవ్వి రోడ్లను గుంతలు చేయడం వలన ప్రభుత్వ సంకల్పం దెబ్బతింటున్నదని వాపోయారు. లాక్‌డౌన్ పిరియడ్‌లో అందంగా తీర్చిదిద్దుకున్నామని తెలిపారు. ఇతర శాఖలకు సి.ఆర్.ఎం.పి ఏజెన్సీలకు అప్పగించిన రోడ్ల కట్టింగ్ చేసే అధికారం లేదని తెలిపారు.
అయితే గతంలో జనవరిలో కొన్ని శాఖలు రోడ్ల కట్టింగ్‌కు ఇచ్చిన అనుమతుల కాలపరిమితి మే 15తో ముగిసినట్లు తెలిపారు. గత అనుమతులతో ఇప్పడు రోడ్డు కట్టింగ్ చేసుకుంటామంటే కుదరదని స్పష్టం చేశారు. వర్షాలు పడుతున్నందున సి.ఆర్.ఎం.పి పరిధిలో దెబ్బతిన్న రోడ్లను 24 గంటలలో పునరుద్దరించాలని, ఎక్కడ వర్షపునీరు నిల్వరాదని తెలిపారు. అలాగే రోడ్ల నిర్వహణపై జవాబుదారిగా వ్యవహరించాలని సూచించారు. అందంగా తీర్చిదిద్దిన రోడ్ల లేన్ మార్కింగ్ పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని తెలిపారు. ప్రాజెక్ట్స్ విభాగంలో చేపట్టిన పనులలో పెండింగ్ పునాధులు, పిల్లర్లను వారంలో పూర్తిచేసి వాహనాల రాకపోకలకు వెసులుబాటు కల్పించాలని తెలిపారు. వర్షపునీరు నిర్మాణ పనుల వద్ద నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. నాలాలలో పూడికతీత పనులు వేగంగా జరుగుతున్నాయని, మిగిలిన పనులను వారంలో పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
నాలాల వెడల్పు, పూడికతీత పనుల వలన వర్షపునీరు సులభంగా బయటకు వెళ్తుందని తెలిపారు. అదేవిధంగా చెరువులు, మూసిలోకి వర్షపునీరు వెళ్లే మార్గాలలో ఉన్న ఆటంకాలను పరిశీలించి తొలగించాలని సూచించారు. అంతర్జాతీయ నగరంగా అభివృద్ది చెందుతున్న హైదరాబాద్ ప్రతిష్టను ఇనుమడింపజేసేవిధంగా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్‌లో పారిశుధ్య విభాగంతో పాటు ఇంజనీరింగ్, వాటర్ వర్క్స్, ట్రాఫిక్, బయోడైవర్సిటీ విభాగాలు కూడా పాల్గొనాలని కోరారు. ఇంజనీరింగ్ అధికారులు తమ పరిధిలో ఉన్న రోడ్లపై దెబ్బతిన్న ఫుట్‌పాత్‌లు, సెంట్రల్ మీడియంలను సరిచేయించాలని తెలిపారు. మూలలు, ఒంపుల వద్ద దెబ్బతిన్న రోడ్లను పరిశీలించి సరిచేయాలని, ఎక్కడ వర్షపునీరు రోడ్ల పక్కన నిలిచి ఉండరాదని తెలిపారు. రోడ్ల పక్కన నిర్మాణ వ్యర్థాలను యుద్దప్రాతిపదికన తొలగించాలని తెలిపారు. ఈ సమావేశంలో సి.ఇ జియాఉద్దీన్, ఇంజనీరింగ్ విభాగాల సూపరింటెండెంట్ ఇంజనీర్లు, డిప్యూటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, సి.ఆర్.ఎం.పి ఏజెన్సీలు పాల్గొన్నాయి.