డ్రోన్ ద్వారా లార్వా నివారణ మందును పిచికారి చేసే కార్యక్రమాన్ని నగర మేయర్ బొంతు రామ్మోహన్ చందానరగ్ సర్కిల్ లోని మియాపూర్ గురునాథం చెరువులో నేడు ప్రారంభించారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, జోనల్ కమిషనర్ హరిచందనలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్రోన్ ద్వారా స్ప్రేయింగ్‌ను ప్రారంభించారు. దాదాపు 20 ఎకరాలకు పైగా ఉండి గుర్రపుడెక్కతో నిండిన గురునాథం చెరువు ద్వారా దోమల ఉత్పత్తై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పరిసర ప్రాంతాల నివాసితులు జిహెచ్ఎంసి అధికారులకు ఫిర్యాదు చేయడంతో డ్రోన్ ద్వారా యాంటి లార్వా మందును స్ప్రేయింగ్ చేసే కార్యక్రమాన్ని మేయర్ ప్రారంభించారు.
ఈ డ్రోన్ ద్వారా అతితక్కువ సమయంలో సమర్థవంతంగా చెరువు మొత్తం యాంటి లార్వా మందును స్ప్రే చేయవచ్చని మేయర్ తెలిపారు. ఈ మందు ద్వారా చెరువులో ఉన్న గుర్రపుడెక్క విస్తరణకు కూడా అడ్డుకట్ట పడుతుందని తెలిపారు. చెరువు మధ్యలోకి జిహెచ్ఎంసి సిబ్బంది వెళ్లడం కష్టతరంతో కూడుకున్నందున డ్రోన్ ద్వారా లార్వా నివారణ మందును స్ప్రేయింగ్ అత్యంత వేగంగా, సులభంగా చేపట్టవచ్చని రామ్మోహన్ తెలిపారు.
ఇప్పటికే శేరిలింగంపల్లి జోన్ లోని పలు చెరువులతో పాటు మూసి నదిలో కూడా డ్రోన్ సహాయంతో యాంటి లార్వా ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించామని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రాజశేఖర్ రెడ్డి, రాగం నాగేందర్, డిప్యూటి కమిషనర్ యాదగిరిరావు తదితరులు పాల్గొన్నారు. కాగా గురునాథం చెరువులో డ్రోన్ ద్వారా యాంటి లార్వా మందు స్ప్రేయింగ్ కార్యక్రమాన్ని జిహెచ్ఎంసి కమిషనర్ దానకిషోర్ కూడా పరిశీలించారు.