సోనియా-మాయావతి సమావేశం రద్దు..!

240
Mayawati

యూపీఏ చైర్‌పర్సన్ సోనియా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌తో బీఎస్పీ అధినేత్రి మాయావతి సమావేశం అవుతున్నట్లు ఆదివారం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ భేటీ రద్దైనట్లు తెలుస్తోంది. ఈ వార్తలపై బీఎస్పీ సీనియర్ నాయకులు స్పష్టత ఇచ్చారు. మాయావతి ఇవాళ ఎవరితోనూ భేటీ కావడం లేదని స్పష్టం చేశారు. ఇవాళ మాయావతి లక్నోలోనే ఉంటుందని, ఢిల్లీ వెళ్లడం లేదని ఆయన చెప్పారు.

Mayawati

ఇక కేంద్రంలో మోదీని గద్దెదించేందుకు కాంగ్రెస్‌ నేతృత్వంలో మహాకూటమికి ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కూటమికి బీఎస్పీ దూరంగా ఉంటూ వస్తోంది. అంతేగాక.. మాయవతి కూడా కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో బీఎస్పీని ప్రతిపక్షాల కూటమిలోకి తీసుకొచ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్యవర్తి పాత్ర పోషించారు. దీనిపై అటు రాహుల్‌, ఇటు మాయావతితో చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలించి మాయావతి, రాహుల్‌ సోమవారం భేటీ కానున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే దీనిపై బహుజన్‌ సమాజ్‌ పార్టీ నేడు స్పష్టతనిచ్చింది.

నిన్న వెల్లడైన ఎగ్జిట్ పోల్స్‌లో మళ్లీ ఎన్డీఏనే అధికారంలోకి వస్తుందని అంచనా వేసిన సంగతి తెలిసిందే. దాదాపు అన్ని సర్వేలు కూడా ఎన్డీఏకు 300లకు పైగా, యూపీఏకు 120 స్థానాలకు పైగా వస్తాయని తెలిపాయి. ఇక ఉత్తరప్రదేశ్‌లో మాత్రం ఈ సారి బీఎస్పీ – ఎస్పీ కూటమి వల్ల బీజేపీకి సీట్ల సంఖ్య తగ్గొచ్చని అన్ని సర్వేలు అంచనా వేశాయి. ఎగ్జిట్ పోల్ లో ఎన్డీయే కూటమికి అత్యధిక సీట్లు వస్తాయన్న అంచనాల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు మారాయి.