పెళ్లి చేసుకుంటానని నమ్మించి..ఏకంగా!

2
- Advertisement -

హైదరాబాద్‌లో మ్యాట్రిమోనీ సైట్‌ ద్వారా పరిచయమైన యువతి ఓ యువకుడిని పెళ్లి పేరుతో నమ్మించి లక్షల రూపాయలు కాజేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించడమే కాకుండా, పెళ్లి ఖర్చుల కోసం పెట్టుబడులు పెట్టాలని సూచిస్తూ సుమారు రూ.35 లక్షలు మోసం చేసింది. చివరకు తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

వివరాల్లోకి వెళ్తే.. మూసాపేట పరిధిలో నివసిస్తూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న కంచి సాయికుమార్ (28)కు మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ ద్వారా అడపా కీర్తి అనే పేరుతో ఓ యువతి పరిచయమైంది. కొంతకాలం ఇద్దరి మధ్య పరిచయం కొనసాగడంతో అది ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పెళ్లి ఖర్చుల కోసం తాను సూచించిన సంస్థల్లో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని యువతి సాయికుమార్‌ను నమ్మించింది.

ఆమె మాటలు నమ్మిన సాయికుమార్ మొదట రూ.50 వేలు పెట్టుబడిగా పెట్టాడు. కొద్దిరోజుల తర్వాత రూ.8 వేల లాభం వచ్చినట్లు చూపించడంతో ఆమెపై నమ్మకం పెరిగింది. ఆ తర్వాత మరో రూ.లక్ష పెట్టుబడి పెట్టగా రూ.80 వేల లాభం వచ్చినట్లు కనిపించింది. దీంతో భారీగా లాభాలు వస్తాయని ఆశించిన సాయికుమార్ విడతలవారీగా మొత్తం రూ.34,22,866 పెట్టుబడిగా పెట్టాడు.

అయితే, పెట్టుబడులకు సంబంధించిన లాభాలను ఉపసంహరించుకునేందుకు ప్రయత్నించగా సాధ్యం కాలేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా డబ్బులు విత్‌డ్రా చేసుకునే అవకాశం లేకపోవడంతో అనుమానం వచ్చింది. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన సాయికుమార్ పోలీసులను ఆశ్రయించాడు.

Also Read:ఆసీస్ కన్సల్టెంట్‌ కోచ్‌గా మైక్ హస్సీ

బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మ్యాట్రిమోనీ పరిచయం, పెట్టుబడుల పేరుతో జరిగిన ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు చేపట్టారు. యువతి అసలు వివరాలు, ఈ మోసంలో మరెవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.

- Advertisement -