హైదరాబాద్ శివారు చర్లపల్లి హెచ్‌పీసీఎల్ గోదాంలో గురువారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్లు పెద్దశబ్దంతో పేలడం మొదలవడంతో అందులో పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు పరుగులు తీశారు. పక్కనే ఉన్న భరత్‌నగర్ భయందోళనలకు గురైన స్థానికులు కూడా ఇళ్ల నుంచి పరుగులుపెట్టారు. దాదాపు అరగంట సేపు ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. ఆరు ఫైర్‌ఇంజిన్లు రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.
చర్లపల్లిలో హెచ్‌పీసీఎల్ గోదాం తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద ప్లాంట్. గ్యాస్‌ను ఇక్కడే సిలిండర్లలో ఫిల్లింగ్ చేస్తుంటారు.ఈ బాట్లింగ్ ప్లాంట్ వద్ద నిముషానికి 60 సిలిండర్లలో గ్యాస్ నింపుతుంటారు. సిలిండర్లు వేగంగా వెళ్లే క్రమంతో స్పార్క్(మెరుపురావడం) పక్కనే ఉన్న సిలిండర్‌కు అంటుకోవడంతో ఒక్కసారిగా 40 సిలిండర్లు పేలిపోయాయని, బాట్లింగ్ పాయింట్ పైకప్పు ధ్వంసమైందని చర్లపల్లి ఫైర్‌స్టేషన్ అధికారి తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే మల్కాజిగిరి ఫైర్‌స్టేషన్ అధికారి ఎన్.మల్లేష్ అప్రమత్తమయ్యారు. ఇటు జీహెచ్‌ఎంసీ, మేడ్చల్ జిల్లా అధికారులు, పోలీసులు తక్షణం స్పందించి ఆరు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు.
విశాఖపట్నం నుంచి చర్లపల్లి ప్లాంటుకు పైపు లైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరా అవుతుంది. దానిని నిల్వ చేసి రీఫిల్లింగ్ యాంత్రాల ద్వారా సిలిండర్లలోకి నింపుతారు. ప్రమాదం తలెత్తగానే సిబ్బంది పైపులైన్ల ద్వారా గ్యాస్ సరఫరాను ఎక్కడికక్కడ ఆపేశారు. ప్లాంటుతోపాటు విశాఖపట్నం నుంచి పైపు లైను వచ్చే మార్గంలో అన్ని ప్రాంతాల్లోనూ సరఫరా ఆపేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని, లేకపోతే ప్రమాద తీవ్రతను వూహించటం కష్టమని ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.
ఇదే ప్రమాదం పగటిపూట జరిగుంటే పెద్దఎత్తున ప్రాణనష్టం వాటిల్లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. హెచ్‌పీసీఎల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత వారం రోజులుగా గ్యాస్ లీక్ అవుతున్నప్పుడు వెంటనే స్పందించాల్సిన అధికారులు దీని గురించి పెద్దగా పట్టించుకోలేదని చెబుతున్నారు. ఈ విస్ఫోటం జరిగిన కొద్దిదూరంలోనే గోదాంలో గ్యాస్ నింపిన రెండు వేల సిలిండర్లున్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.