కర్నాటకలో ఎన్నికల వేడి పెరిగింది. ఎన్నికల తేదీలు అటు అనౌన్స్ చేశారో లేదో… ఇటు రాజకీయ నేతల టూర్లు పెరిగాయి. రాహుల్‌గాంధీ,మోడీ కర్నాటకలో మకాం వేసి ప్రచారాన్ని ముందుండి నడిపిస్తున్నారు. ప్రధాని మోడీ ఏకంగా 16 బహిరంగ సభలు, ర్యాలీల్లో పాల్గొంటు బీజేపీ గెలుపును భుజాన వేసుకున్నారు.
తాజాగా ప్రధాని నరేంద్రమోడీ కర్నాటకలో పర్యటిస్తుండగానే నోట్ల కట్టలు పెద్ద ఎత్తున పట్టుబడ్డాయి. నోట్ల కట్టలతో వెళుతున్న కారును పట్టుకున్నారు పోలీసులు. కారు నిండా డబ్బులే పట్టుబడటంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. అధికార వర్గాల సమాచారాం ప్రకారం రూ.10 కోట్లు ఉన్నట్లు చెబుతున్నారు. బెంగళూరు శివార్లలోని నీలమంగళ ప్రాంతంలోని తనిఖీల్లో పట్టుకున్నారు.
ఆరు బ్యాగుల్లో ఉన్న ఈ డబ్బు కట్టలను బెంగళూరు నుంచి శివమొగ్గ తరలిస్తున్నట్లు డ్రైవర్ తెలిపారు. డబ్బుకి సంబంధించిన పత్రాలు లేకపోవటంతో సీజ్ చేయడంతో పాటు డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్నారు.కారు ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందినదిగా చెబుతున్నారు. కర్నాటక ఎన్నికలు అనౌన్స్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.40 కోట్ల డబ్బు ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.