‘కాళేశ్వరం’తో బాధ్యత మరింత పెరిగింది..

336
Mareddy Srinivas Reddy
- Advertisement -

దేశానికే తలమానికమైన బహుళార్ధక పథకం కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభంతో పౌరసరఫరాల సంస్థ బాధ్యత మరింత పెరిగిందని పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో 141 టీఎంసీల నీటి నిల్వలతో 45 లక్షల ఎకరాలకు రెండు పంటలకు నీరు అందడంతో సాగు విస్తీర్ణం పెరిగి ధాన్యం దిగుబడి సైతం భారీగా పెరగనుంది.

రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంట్‌, కొత్తగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులతో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో గడిచిన రెండు మూడేళ్లుగా రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడులు పెరిగాయి. దీనికి అనుగుణంగా రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కనీస మద్దతు ధరకు పౌరసరఫరాల సంస్థ ధాన్యాన్ని కొనుగోలు చేస్తోంది.

ఈ ఏడాది ఖరీఫ్‌, రబీలో ఇప్పటి వరకు దాదాపు 14.5 లక్షల మంది రైతుల నుండి 77 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది.కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభంతో ఈ ఏడాది ఇది మరింత పెరగనుంది. ఈ నేపథ్యంలో పౌరసరఫరాల సంస్థ బాధ్యత పెరగనుంది. ధాన్యం దిగుబడికి అనుగుణంగా కొనుగోళ్లు చేయవలసిన బృహత్తరమైన బాధ్యత సంస్థపై ఉందని ఛైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద బహుళార్ధక ఎత్తిపోతల పథకకాన్ని రికార్డు స్థాయిలో శంకుస్థాపన చేసిన మూడేళ్లలోనే ప్రాజెక్టు పూర్తి చేసి ప్రారంభించడం దేశానికే గర్వకారణమని అన్నారు. బంగారు తెలంగాణ లక్ష్యంగా రైతు సంక్షేమం కోసం అహర్నిశలు కృశి చేస్తూ ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావుకి చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల రైతాంగానికి పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుంది. కావున రైతులందరూ ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని ఒక పెద్ద పండుగలా జరుపుకోవాలని శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు.

- Advertisement -