సీఎం కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా తెలంగాణ పౌరసరఫరాల సంస్థను రాష్ట్రంలోనే అత్యున్నత సంస్థగా తీర్చిదిద్దుతానని తెలంగాణ పౌరసరఫరాల చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం పౌరసరఫరాల భవన్లో ఆయన పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం జరిగిన బహిరంగ సభలో మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. పౌరసరఫరాల సంస్థ కార్యక్రమాలపై క్షేత్రస్థాయిలో నాకు పూర్తిగా అవగాహన ఉంది. సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నేను ప్రత్యక్షంగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు, చెల్లింపులు అంశాలను పరిశీలించాను. రైతుల సమస్యలపై పూర్తిస్థాయిలో అవగాహన ఉంది.
రైతు ప్రయోజనాలే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోంది. దానికి అనుగుణంగానే మా కార్పొరేషన్ ముందుకెళ్తుంది. పౌరసరఫరాల విభాగం ప్రభుత్వనికి చాలా కీలకమైంది. ఇది పూర్తిగా పేదలకు సంబంధించన శాఖ. ఇటువంటి విభాగంలో పనిచేసే అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు నా ప్రత్యేక కృతజ్ఞతలు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టుల వల్ల రాబోయే రోజుల్లో అదనంగా లక్షలాది ఎకరాలు సాగులోకి రాబోతుంది. గత ఏడాది కంటే ఈ ఏడాది ఖరీఫ్‌లో 210% అధికంగా పౌరసరఫరాల శాఖ రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసింది.
గతేడాది ఖరీఫ్‌లో 16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, ఈ సంవత్సరం ఖరీఫ్‌లో ఇప్పటి వరకు 36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇది ఒక రికార్డు.. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులు, సకాలంలో వర్షాలు, 24 గంటలు కరెంటు, రైతు బంధు వంటి పథకాలు రాష్ట్రంలో ధాన్యం దిగుబడికి ప్రధాన కారణాలు. రాబోయే రోజుల్లో ధాన్యం దిగుబడులు భారీగా పెరగనున్న నేపథ్యంలో రైతులకు కనీస మద్ధతు ధర లభించేలా కోటి టన్నులకు పైగా ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు లక్ష్యంగా ప్రణళికలు రూపొందించుకుంటాం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అకున్ సబర్వల్, రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ ఆలీ,ఎమ్మెల్యేలు టీ.హరీష్‌రావు, ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్‌రెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బిబి పాటిల్,ఎమ్మెల్సీలు.. నాయినీ నర్సింహారెడ్డి, కర్నె ప్రభాకర్, టీయస్‌ఐఐసీ చైర్మన్ జీ. బాలమల్లు, జీఎచ్యంసీ మేయర్ బొంతు రామ్మెహన్తో పాలు పలువురు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ఇంకా పలువురు కార్పొరేషన్ చైర్యన్లు పాల్గొన్నారు.