మావోయిస్టు అగ్రనేత సుధాకర్, ఆయన భార్య నీలిమ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఏడాదిగా సుధాకర్ లొంగిపోయేందుకు యత్నిస్తున్నారని డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. సుధాకర్ అలియాస్ సత్వాజీ స్వస్థలం నిర్మల్ జిల్లా సారంగాపూర్ అని తెలిపిన మహేందర్ రెడ్డి ఇంటర్ చదివే సమయంలో పీపుల్స్ వార్‌కు చెందిన ఆర్‌ఎస్‌యులో చేరారని తెలిపారు. తొలుత ఆయుధాలకు సంబంధించిన టెక్నికల్ కమిటీలో సుధాకర్ చేరారని.. బెంగళూరు కేంద్రంగా ఆయన పనిచేశారని డీజీపీ తెలిపారు.
వివిధ హోదాల్లో పీపుల్స్ వార్ గ్రూపులో పని చేశారు. బెంగళూరు కేంద్రంగా అన్ని రాష్ర్టాల్లోని పీపుల్స్ వార్ గ్రూపులకు ఆయుధాలను సరఫరా చేసేవారు. 1986లో సుధాకర్‌ను పోలీసులు అరెస్టు చేసి 11 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. 1989లో జైలు నుంచి విడుదలయ్యాక వరవరరావు ఆధ్వర్యంలో నడిచిన రైతు కూలీ సంఘంలో పని చేశారు. జైల్లోనే వరవరరావుతో సుధాకర్‌కు పరిచయం ఏర్పడింది. 1990 నుంచి ఇప్పటి వరకు అండర్ గ్రౌండ్‌లో ఉంటూ పని చేశారని చెప్పారు. సీపీఐ మావోయిస్టు గ్రూపుల్లో వివిధ హోదాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వర్తించారని చెప్పారు.
సుధాకర్ భార్య అరుణ స్టేట్ కమిటీ మెంబర్‌గా పని చేస్తూ సరెండర్ అయ్యారని డీజీపీ తెలిపారు. జార్ఖండ్, బీహార్ కమిటీల్లో ఆమె పని చేశారు. 43 ఏళ్ల వయసున్న అరుణ వరంగల్ జిల్లాలోని మహ్మదాపూర్ వాని అని పేర్కొన్నారు. 1998లో సుధాకర్‌ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సుధాకర్‌తో పాటు అరుణ ఈఆర్‌బీలో పని చేశారు. ప్రభుత్వం ప్రకటించిన రివార్డును సుధాకర్‌కు అందజేస్తామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు.