సైరస్‌ మృతిపై పలువురి సంతాపం

191
cyrus
- Advertisement -

ప్రముఖ వ్యాపార వేత్త, టాటా స‌న్స్ మాజీ చైర్మ‌న్ సైర‌స్ మిస్త్రీ ఆదివారం రోడ్డు ప్ర‌మాదంలో దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. ఆయ‌న మృతి ప‌ట్ల రాజ‌కీయ‌, పారిశ్రామిక ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిప‌ల్‌, ప‌రిశ్ర‌మ‌ల‌శాఖ మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. విన‌యం, హుందాత‌నం, మాన‌వ‌త్వం క‌ల‌బోసిన వ్య‌క్తుల్లో ఆయ‌న ఒక‌రు. గ‌త ఎనిమిదేండ్లుగా ఒక స్నేహితుడిగా సైర‌స్ మిస్త్రీని క‌లుసుకున్న‌ప్పుడు సంతోషంగా ఉండేవాడిని. కానీ ఇప్పుడు సైర‌స్‌మిస్త్రీ ఇక లేరు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌లుగు గాక‌ అని ట్వీట్ చేశారు.

సైర‌స్ మిస్త్రీ హ‌ఠాన్మ‌ర‌ణం ప‌ట్ల ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ, కేంద్ర మంత్రులు పీయూష్ గోయ‌ల్‌, నితిన్ గ‌డ్క‌రీ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు.

సైర‌స్ మిస్త్రీ లోటు పారిశ్రామిక‌, వాణిజ్య ప్ర‌పంచానికి తీర‌ని న‌ష్టం అని మోదీ పేర్కొన్నారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు, బంధు మిత్రుల‌కు సంతాపం వ్య‌క్తం చేశారు. భార‌త పారిశ్రామిక రంగం ఎదుగుతున్న ఒక తార‌ను కోల్పోయింద‌ని పీయూష్ గోయ‌ల్‌, నితిన్ గ‌డ్క‌రీ వ్యాఖ్యానించారు.

మిస్త్రీ మ‌ర‌ణం ప‌ట్ల మ‌హీంద్రా గ్రూప్ చైర్మ‌న్ ఆనంద్ మ‌హీంద్రా, ఆర్పీజీ ఎంట‌ర్‌ప్రైజెస్ చైర్మ‌న్ హ‌ర్ష్ గోయెంకా సంతాపం వ్య‌క్తం చేశారు. మిస్త్రీ మ‌ర‌ణాన్ని జీర్ణం చేసుకోవ‌డం క‌ష్టంగా ఉంద‌ని ఆనంద్ మ‌హీంద్రా పేర్కొన్నారు. మిస్త్రీ ఒక స్నేహితుడు, రాజ‌నీతిజ్ఞుడు అని హ‌ర్ష్ గోయెంకా వ్యాఖ్యానించారు.

మిస్త్రీ మ‌ర‌ణం ఆయ‌న కుటుంబానికి మాత్ర‌మే కాక యావ‌త్ వ్యాపార ప్ర‌పంచానికి న‌ష్టం అని మ‌హారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే సంతాప సందేశంలో పేర్కొన్నారు.

నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎంపీ సుప్రియా సూలే తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. త‌న‌కు సోద‌రుడి వంటి మిస్త్రీ మ‌ర‌ణించార‌న్న వార్త న‌మ్మ‌లేకున్నాన‌ని పేర్కొన్నారు. మిస్త్రీ మ‌ర‌ణం త‌న‌కు, త‌న భ‌ర్త స‌దానంద్ సూలేకు వ్య‌క్తిగ‌తంగా తీర‌ని లోటు అని వ్యాఖ్యానించారు.

- Advertisement -