గోవా ముఖ్యమంత్రిగా నేడు (మంగళవారం) రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌ప్రమాణస్వీకారం చేయనున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు కొంతమంది క్యాబినెట్ సహచరులతో కలిసి ఆయన ప్రమాణం చేస్తారు. 15 రోజుల్లో అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది.
అయితే సోమవారం మధ్యాహ్నం రక్షణమంత్రి పదవికి రాజీనామా చేసినట్టు పారికర్ తెలిపారు. ప్రధానమంత్రి సలహామేరకు రక్షణమంత్రిత్వ అదనపు బాధ్యతలను కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి అప్పగించారు. ఈ మేరకు రాష్ట్రపతి సచివాలయం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
40 మంది ఎమ్మెల్యేలున్న గోవా అసెంబ్లీలో 22మంది ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉన్నదని పారికర్ ఆదివారం గవర్నర్‌కు విన్నవించారు. ఈమేరకు ఆయా ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన మద్దతు లేఖను సమర్పించారు. దీంతో గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆమోదం తెలిపినట్టు రాజ్‌భవన్ కార్యదర్శి రూపేశ్‌కుమార్ ఠాకూర్ సోమవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.