గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు భాజపా ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలో కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ గోవా ముఖ్యమంత్రిగా రేపు సాయంత్రం 5 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం కేంద్ర రక్షణ మంత్రిగా ఉన్న ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీలో బల నిరూపణ కోసం ఆయనకు 15 రోజుల సమయం కేటాయించారు.
గవర్నర్ మృదుల సిన్హా.. మనోహర్ పారికర్‌ను గోవా సీఎంగా నియమించారు అని గవర్నర్ కార్యదర్శి రూపేశ్ కుమార్ ఠాకూర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. 13 మంది బీజేపీ ఎమ్మెల్యేలతోపాటు ముగ్గురు ఎంజీపీ, ముగ్గురు గోవా ఫార్వర్డ్ పార్టీ, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిపి తనకు 21 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు పారికర్.. గవర్నర్‌కు జాబితా ఇచ్చినట్లు ఆ ప్రకటన తెలిపింది.
నిన్న వెలువడిన గోవా ఎన్నికల ఫలితాల్లో ఏ ఒక్క పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాలేదు. కాంగ్రెస్ 17 స్థానాలు, భాజపా 13 స్థానాల్లో విజయం సాధించాయి. మరోవైపు గోవా, మణిపూర్‌లలో బీజేపీ ఎన్నికలను దొంగిలిస్తున్నదని మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం ఆరోపించారు.
రెండోస్థానంలో నిలిచిన పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే హక్కు లేదని ఆయన స్పష్టంచేశారు. గోవాలో 17 సీట్లతో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే బీజేపీయేతర ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉన్నట్లు మాత్రం కాంగ్రెస్ చెప్పలేకపోయింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆమోదం మేరకే పారికర్‌ను తిరిగి గోవా సీఎంగా నియమించినట్లు కేంద్ర మంత్రి, గోవా ఎన్నికల ఇన్‌చార్జ్ నితిన్ గడ్కరీ స్పష్టంచేశారు. సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.