కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని, అరాచకాలను ప్రశ్నిస్తున్నందుకే తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ మన్నె క్రిశాంక్ మండిపడ్డారు. శుక్రవారం తెల్లవారుజామున తన నివాసంలో పోలీసులు జరిపిన సోదాలు, దౌర్జన్యంపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో మాస్క్ వేసుకుని ప్రవేశించింది ఎవరని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినందుకు 100 మంది పోలీసులతో నా ఇంటిపైకి రావడం ఏంటి? నేనేమైనా అంతర్జాతీయ నేరస్థుడినా? లేక ఎక్కడికైనా పారిపోతున్నానా? అని ఆయన ప్రశ్నించారు. ఉదయం 5 గంటలకే తమ ఇంటికి వచ్చిన పోలీసులు దౌర్జన్యంగా గేటు తాళాలు పగలగొట్టి, లోపలికి వచ్చి ఇంటి డోర్‌ను కూడా పగలగొట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.
పోలీసుల హఠాత్ దాడి, దౌర్జన్యంతో తీవ్ర భయాందోళనకు గురైన తన 7 ఏళ్ల కుమార్తె ఆందోళనతో స్కూల్ పరీక్షకు కూడా వెళ్లలేక ఇంట్లోనే ఉండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడి షెల్ కంపెనీల వ్యవహారాన్ని బయటపెట్టినందుకే తనపై ఇన్ని అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఇప్పటికే తనపై అనేక కేసులు బనాయించి రెండుసార్లు జైలుకు పంపారని గుర్తుచేశారు. నువ్వు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎలాంటి బెదిరింపులకు పాల్పడినా కాంగ్రెస్ వైఫల్యాలను, అవినీతిని ప్రశ్నించడం ఆపే ప్రసక్తే లేదు అని మండిపడ్డారు మన్నె క్రిశాంక్. ఎన్ని అణచివేత చర్యలకు పాల్పడినా ప్రతిపక్షంగా ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
Also Read:నానితో కయాదు లోహార్..

