తెలంగాణ టీడీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ నుండి గెలిచిన ఏకైక కార్పొరేటర్ మందడి శ్రీనివాస్ టీడీపీకి గుడ్ బై చెప్పారు. తన కార్పొరేటర్ పదవితో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో టీడీపీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని తెలిపిన శ్రీనివాస్ లోక్ సభ ఎన్నికల్లో పార్టీ పోటీ చేయకపోవడం తనను బాధించిందన్నారు. కార్యకర్తలను కాపాడుకోవడంలో రాష్ట్ర నాయకత్వం పూర్తిగా విఫలమైందన్నారు. శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
మరోవైపు టీటీడీపీ కార్మిక విభాగం టీఎన్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్.రెడ్డితో పాటు సనత్ నగర్ నుండి టీడీపీ తరపున పోటీచేసి ఓటమిపాలైన కూన వెంకటేష్ గౌడ్ కూడా పార్టీని వీడనున్నట్లు సమాచారం. ఇప్పటికే టీఆర్ఎస్ నేతలతో సంప్రదింపులు జరిపిన వీరు త్వరలో కారెక్కనున్నారు. వీరితో పాటు గ్రేటర్ టీడీపీకి చెందిన సీనియర్ నేతలు సైతం గులాబీ గూటికి చేరనుండటంతో తెలంగాణలో టీడీపీ దాదాపు ఖాళీ అయినట్లే.
ఇప్పటికే టీడీపీ నుండి గెలిచిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య టీఆర్ఎస్‌లో చేరుతానని ప్రకటించగా మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు గులాబీ గూటికి చేరిపోయారు. టీఆర్ఎస్ తరపున ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. పేరున్న నేతలందరూ కారెక్కుతుండటంతో కార్యకర్తలు సైతం వారి బాటలోనే నడుస్తున్నారు. ఇక టీడీపీ పార్టీ ఆవిర్భావం నుండి సాధారణ ఎన్నికలకు దూరంగా ఉండడం 37 ఏళ్లలో ఇదే తొలిసారి.