ప్రముఖ టాలీవుడ్ నటుడు మోహన్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని మోదీని కలిసిన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా మోదీతో అరగంట సేపు ఏకాంతంగా మాట్లాడారు మోహన్ బాబు. ఇప్పుడు వీరిద్దిరి భేటీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చాంశనీయంగా మారింది. అలాగే సాయంత్రం కేంద్రమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కూడా కలిశారు మోహన్ బాబు. అయితే మోహన్ బాబు బీజేపీలోకి వెళ్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
ఈ ప్రచారంపై స్పందించారు మోహన్ బాబు కూతురు నటి మంచు లక్ష్మీ. తమ కుటుంబ సభ్యులు మోదీని కలవడం వెనుక ఎటువంటి రాజకీయ కారణాలు లేవన్నారు. మోదీ రెండోసారి ప్రధాని అయిన మోదీని ఇటీవల పాన్ ఇండియా సినీ నటులందరూ కలిసి అభినందించిన విషయాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు.మోదీని కలిసే అవకాశం కొంతమంది నటులకే దక్కిందని, ఇప్పుడు దక్షిణాది సినీ రంగ ప్రముఖులతో భేటీ కావాల్సిందిగా మోదీ నుంచి మాట తీసుకున్నానని చెప్పారు. దక్షిణాది నుంచి రిప్రజెంటేటివ్ గా మీటింగ్ కు సంబంధించిన వ్యవహారాలన్నీ తానే చూసుకుంటానని, త్వరలోనే మీటింగ్ ఏర్పాటు చేస్తామని మంచు లక్ష్మి చెప్పింది.