నెటిజన్లపై మంచు లక్ష్మీ ఆగ్రహం..

47

ఎదుటివాళ్ల మాటను అర్థం చేసుకోకుండా.. ఛాన్స్‌ దొరికితే చాలు కామెంట్‌ చేయడానికి కొంతమంది సిద్ధంగా ఉంటారని నటి మంచు లక్ష్మి నెటిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికై శనివారం ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఈ సందర్భంగా తన తమ్ముడు విష్ణుకు శుభాకాంక్షలు చెబుతూ మంచు లక్ష్మి ఓ ట్వీట్ చేసింది.

‘‘ఈరోజు మా కుటుంబానికి అత్యంత శుభదినం. నా సోదరుడు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. ప్రపంచాన్ని మార్చేందుకు ఈ రోజు నుంచి నువ్వు ప్రారంభించే ఈ కొత్త ప్రయాణానికి ఆల్ ద బెస్ట్. నాకు చాలా గర్వంగా ఉంది. నువ్వు ఎలాంటి మార్పులు తీసుకొస్తావో చూస్తుంటాను’’ అంటూ ఆమె ట్వీట్ చేసింది.

ఆమె ట్వీట్ కు నెటిజన్లు పంచులు వేయడం మొదలుపెట్టారు. ‘మా’ అధ్యక్షుడు ప్రపంచం మొత్తాన్ని ఎలా మార్చగలడంటూ వరుస కామెంట్లు చేస్తున్నారు. తాజాగా నెటిజన్ల కామెంట్లపై లక్ష్మి ఫైర్‌ అయింది. ‘‘ఇక చాలు ఆపండి. ఎప్పుడు చాన్స్ వస్తుందా.. ఎవర్ని కామెంట్ చేద్దామా? అని చూస్తుంటారు. నటీనటులకు సినిమానే ప్రపంచం. విషయాన్ని అర్థం చేసుకోండి. నా ఉద్దేశం మీరనుకునే ప్రపంచం కాదు. ‘మా’ అసోసియేషన్ అనే ప్రపంచాన్ని మార్చడం’’ అని అన్నారు.