ఆస్ట్రేలియా పేరు చెబితేనే టక్కును గుర్తుకొచ్చేది కంగారు జంతువు. ఆస్ట్రేలియా జాతీయ జంతువు కూడా. కంగారూలు చాలా విచిత్రమైన జంతువులు. ఆకర్షణీయమైన కళ్ళు, జింక లాంటి మెడ, మనిషి కన్నా పొడవుగా, చూడగానే ఆకర్షించే, చెంగుచెంగున ఎగురుకుంటూ గమ్మత్తుగా కనిపిస్తుంది. అవి అచ్చం మనుషుల్లాగే రెండు కాళ్లతో పరిగెత్తగలవు, నాలుగు కాళ్లతోనూ నడుస్తాయి. వేరే జంతువులతో పోరాడుతాయి. మనుషులతో బాక్సింగ్ చేయడానికి కూడా రెడీ అయిపోతాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే ఒకటి ప్రస్తుతం యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది.
అడవి లాంటి ప్రాంతంలో ఒక కుక్కను కంగారూ తన ముందుకాళ్లతో పీక పట్టుకుని దాంతో ఫైటింగ్ చేస్తుంటే.. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి వెళ్లి కంగారూ ముఖం మీద గట్టిగా ఓ పంచ్ ఇస్తాడు. దాంతో దిమ్మతిరిగిన కంగారూ.. కాసేపు అలాగే ఉండిపోతుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని సదరు వ్యక్తితో పాటే జీపులో ఉన్న మరో వ్యక్తి వీడియో తీసి, దాన్ని యూట్యూబ్‌లో షేర్ చేశాడు. అంతే సోషల్ మీడియాలో వైరలైంది. ఇప్పటికే 2 కోట్లమంది ఈ వీడియోని చూశారు. కంగారుకు పంచ్ ఇచ్చిన వ్యక్తిని టరోరంగా వెస్ట్రన్ ప్లెయిన్స్ జూలోని ఏనుగుల సంరక్షకుడు గ్రెయిగ్ టాన్‌కిన్స్‌గా గుర్తించారు.