తెలంగాణ కార్మిక శాఖమంత్రి చామకూర మల్లారెడ్డి టీఆర్ఎస్ మల్కాజ్‌గిరి పార్లమెంట్ సన్నాహాక సమావేశంలో ఉర్రూతలూగించారు. సభా వేదికపై తనదైన స్టైల్‌లో డ్యాన్స్ వేసి కార్యకర్తలను ఉర్రూతలుగించారు. మేడ్చల్ జిల్లా కొంపల్లి జి.బి.ఆర్ గార్డెన్ లో మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గాల విస్తృతస్థాయి సమావేశంలో కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి డ్యాన్స్ చేశారు. వీరిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తూంటే కార్యకర్తల చప్పట్లతో సభా ప్రాంగణం మార్మోగిపోయింది.
మల్లారెడ్డి డ్యాన్స్ చేయడం,తనదైన మాటతీరుతో ఆకట్టుకోవడం ఇదే తొలిసారి కాదు. డబ్బున్నోళ్ల పిల్లను పెళ్లిచేసుకోండని విద్యార్థులకు సూచించినా…గంగ్నామ్ స్టెప్పులేసిన ఆయనకే చెల్లింది.
2014 సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి గా పోటీ చేసి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ తరపున విజయం సాధించిన ఏకైక ఎంపీ మల్లారెడ్డి. సీఎం కేసీఆర్ ప్రజాకర్షక పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్‌లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ అసెంబ్లీ స్థానం నుండి పోటీచేసి 80వేల మెజార్టీతో గెలుపొందారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే మల్లారెడ్డికి మంత్రి పదవిని కట్టబెట్టారు.