మజ్ను మూవీ రివ్యూ..

320
- Advertisement -

వరుస విజయాలతో మంచి ఊపుమీదున్న హీరో నాని ‘ఉయ్యాల జంపాల’ ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన సినిమా మజ్ను. నానికి జంటగా అను ఇమ్మానియేలు, ప్రియ నటిస్తున్న ఈ సినిమాలో దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఒక ప్రత్యేక పాత్రలో నటించడంతో సినిమాపై అంచనాలను మరింత పెంచింది. భలే భలే మగాడివోయ్, కృష్ణ‌గాడి వీర ప్రేమగాథ, జెంటిల్‌మన్ లాంటి వరుస విజయాల తరువాత వస్తున్న ఈ మజ్నుతో తన విజయ పరంపరను కొనసాగించాడా లేదా చూద్దాం.

కథ :

భీమవరానికి చెందిన నాని(ఆదిత్య) డైరెక్టర్ రాజమౌళి టీంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తుంటాడు. ఐటీ కన్సల్టెంట్ అయిన సుమ (ప్రియాశ్రీ) ప్రేమలో పడతాడు. ఇక ఆ అమ్మాయి మెప్పు పొందడానికి నిజాయితీగా ఉంటూ తన అందమైన, పాత ప్రేమ కథని ఆమెతో చెప్తాడు. అతని నిజాయితీని చూసి సుమ కూడా అతన్ని ప్రేమిస్తుంది.వీరిద్దరి ప్రేమ కథలోకి అనుకోకుండా ఆదిత్య పాత ప్రేయసి కిరణ్ (అను ఇమ్మానుయేల్) ప్రవేశిస్తుంది. దీంతో వీరి ప్రేమ కథ కొత్త మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది…అసలు ఆదిత్య హైదరాబాద్‌ ఎందుకు వస్తాడు?కిరణ్…ఆదిత్యకి ఎందుకు దూరమవుతుంది? మళ్లీ దగ్గర అయ్యేందుకు ఎందుకు ప్రయత్నిస్తోంది? అన్నదే కథ.

ప్లస్ పాయింట్స్ :

మజ్ను టైటిల్‌తో వచ్చిన ఇలాంటి కథలు టాలీవుడ్‌కి కొత్తకాదు. కానీ అలాంటి కథను సైతం ప్రేక్షకులు మెచ్చే విధంగా దర్శకుడు విరించి వర్మ హ్యాండిల్ చేసి శభాష్ అనిపించుకున్నాడు. ఫస్ట్ హాఫ్ లో భీమవరంలో సాగే హీరో ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీ అయితే చాలా రియలిస్టిక్ గా, రొమాంటిక్ సాగుతూ బాగుంది. ప్రేమకథను తెరకెక్కించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవడంలో దర్శకుడు వంద శాతం సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.

సినిమా…సినిమాకి వైవిధ్యాన్ని ప్రదర్శిస్తు…తన సహజ నటనతో మజ్నుని ఇంకాస్త పైకి తీసుకెళ్లాడు నాని.ప్రేమ కథలో పాత్రకు ప్రాణం పోశాడనే చెప్పాలి. లెక్చరర్‌గా…అసిస్టెంట్ డైరెక్టర్‌గా నాని చేసిన క్యారెక్టర్లు ఒదిగిపోయాయి. ఇక హీరోయిన్స్‌ ప్రియా శ్రీ,అను ఇమ్మూన్యుయేల్‌ మొదటి సినిమానే ఐనా….తమ పాత్రలకు తగ్గ న్యాయం చేశారు. ఫస్టాఫ్‌లో పోసాని..సెకండ్ హాఫ్ లో వచ్చే వెన్నల కిశోర్ కామెడీ, స్వతహాగా నాని పండించిన హాస్యం బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమాకు కథే మైనస్‌..అన్ని ప్రేమ కథల్లాగే ఇది కూడా మామూలు కథే.మొదటి భాగం మొత్తం అందంగా నడిచి సెకండ్ హాఫ్ మాత్రం రొటీన్ గా సాగుతూ కాస్త బోర్ కొట్టించింది. కొన్ని సీన్స్ ఉయ్యాలా జంపాలా మూవీని గుర్తుచేశాయి. ఇక ప్రీ క్లైమాక్స్ అయితే పూర్తిగా ఊహాజనితంగా ఉండటంతో పెద్దగా ఆసక్తికరంగా అనిపించలేదు.

సాంకేతిక విభాగం :

జ్ఞాన శేఖర్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్‌. ప్రతి ఫ్రేమ్ చాలా క్లీన్ గా, అందంగా ఉంటూ ఎంజాయ్ చేసే విధంగా తెరకెక్కించాడు. భీమవరం బ్యాక్ డ్రాప్ లో నడిచే లవ్ స్టోరీని ప్రతి ఫ్రేమ్ చాలా అందంగా, మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చేలా తెరపై చూపించాడు.ఎడిటింగ్ కూడా బాగుంది. గోపి సుందర్ సంగీతం బాగుంది. కథానాన్ని కొత్తగా రాసుకుని దాన్ని తెరపై అందంగా ఆవిష్కరించడంలో దర్శకుడు విరించి వర్మ సక్సెస్ అయ్యాడు. నిర్మాణ విలువలు చాలా గొప్పగా ఉన్నాయి.

తీర్పు :

ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం – భ‌లే భ‌లే మ‌గాడివోయ్ – కృష్ణ‌గాడి వీర‌ప్రేమ‌గాథ – జెంటిల్‌మ‌న్ ఇలా నాలుగు వ‌రుస హిట్ల‌తో మంచి ఊపు మీద ఉన్న నాని…మజ్నుతో మరోసారి తన నటనా వైవిధ్యాన్ని చూపించాడు. మంచి కథనం, హాస్యంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మజ్నుతో మరోసారి హిట్ అందుకున్నాడే చెప్పాలి. అందమైన లవ్ స్టోరీ, మంచి టైమింగ్ తో సాగే కామెడీ,నాని నటన క్లైమాక్స్ ఈ చిత్రంలోని ప్లస్ పాయింట్స్ కాగా కాస్త బోర్ కొట్టించే సెకండ్ హాఫ్ రొటీన్ కథనం సినిమాకు మైనస్ పాయింట్స్. మొత్తంగా మజ్నుతో నాని….ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించాడు..ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెసయ్యాడు.

విడుదల తేదీ : 23/09/ 2016
రేటింగ్ : 3.25/5
నటీనటులు : నాని, అను ఇమ్మానుయేల్
సంగీతం : గోపి సుందర్
నిర్మాత : గీత గొల్ల, పి. కిరణ్
దర్శకత్వం : విరించి వర్మ

- Advertisement -