వేసవి కాలం వచ్చిందంటే చల్లటి ద్రవాలను సేవించడానికే ప్రతిఒక్కరు ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. కూల్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూస్, సలాడ్.. ఇలా ఎన్నో రకాల శీతల పానీయాలను గుటగుట తాగేస్తుంటారు. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతుంటారు. అయితే కూల్ డ్రింక్స్ అధికంగా సేవిస్తే ఆరోగ్యానికి ప్రమాదమే. కాబట్టి శరీరాన్ని సహజ సిద్దంగా చల్లగా ఉంచే మజ్జిగ, లస్సీ.. వంటి వాటిని ఎక్కువగా తాగితే మంచిదట. వేసవి తాపాన్ని తగ్గించి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో మజ్జిగ అన్నిటికంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. మజ్జిగ తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ కూడా సవ్యంగా జరుగుతుంది. మజ్జిగలో కాల్షియం మెండుగా ఉంటుంది. ఇది ఎముకలను దంతాలను బలపరుస్తుంది. ఇంకా ఇందులో పొటాషియం, విటమిన్ బి12, వంటి పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. వీటి వల్ల మూత్రంలో మంట, ఎసిడిటీ వంటి సమస్యలు దూరమవుతాయి. .
సాధారణంగా వేసవికాలంలో శరీరంలోని నీటి కంటెంట్ తగ్గుతుంది. తద్వారా డీహైడ్రేషన్ బారిన పడి వడదెబ్బ తగిలే ప్రమాదం చాలా ఎక్కువ. కాబట్టి ఈ వేసవిలో రోజుకు కనీసం మూడు లేదా నాలుగు సార్లు మజ్జిగ తాగితే హైడ్రేట్ గా ఉండడంతో పాటు తక్షణ శక్తి లభిస్తుంది. ఇంకా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. తద్వారా అలసట లేకుండా యాక్టివ్ గా ఉండేందుకు దోహదం చేస్తుంది. మజ్జిగతో పాటుగా కొత్తిమీర లేదా దనియాల పొడి, శొంఠి వంటివి కలుపుకొని తాగితే మరి మంచిదట. కాలేయ పని తీరును మెరుగు పరచడంలో కూడా మజ్జిగలో ఉండే పోషకాలు ఎంతో ఉపయోగ పడతాయి. ఇంకా క్యాన్సర్ కారకాలను దూరం చేయడంలోనూ, గుండె పని తీరును మెరుగు పరచడంలోనూ మజ్జిగ ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ వేసవికాలంలో కూల్ డ్రింక్స్ తాగడం కంటే సహజసిద్దంగా మజ్జిగ తయారు చేసుకొని తాగడం ఎంతో మంచిది.
Also Read:టరుపై ఎమ్మెల్యే దాడి..