ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా అతిథ్య శ్రీలంకకు మరోసారి షాకిచ్చింది బంగ్లాదేశ్. టీ20ల్లో సిసలైన మజాను ప్రేక్షకులకు చూపిస్తు బంగ్లా బ్యాట్స్‌మెన్ రెచ్చిపోయారు. లంక విధించిన 160 పరుగుల లక్ష్యాన్ని మరో బంతి మిగిలిఉండగానే గెలిచి ఫైనల్‌కు చేరింది. తమీమ్ ఇక్బాల్ (50: 42 బంతుల్లో 4×4, 2×6), మహ్మదుల్లా (43 నాటౌట్: 18 బంతుల్లో 3×4, 2×6)రాణించడంతో బంగ్లా విజయతీరాలకు చేరింది.సిరీస్లో వరుసగా రెండోసారి శ్రీలంకను ఓడించిన బంగ్లా…ఫైనల్లో భారత్‌తో తలపడనుంది.
ఓవర్ ఓవర్‌కి గెలుపు సమీకరణాలు మారిపోయాయి. చివరి ఓవర్లో 12 పరుగులు చేయాల్సి ఉండగా.. తొలి బాల్ డాట్ కావడం, రెండో బంతికి ముస్తాఫిజుర్ రనౌట్ కావడంతో బంగ్లా ఓటమి ఖాయమని అంతా అనుకున్నారు. ఈదశలో మహ్మదుల్లా బంగ్లాకు వెన్నెముకలా నిలిచాడు. వరుస బంతుల్లో 4,2,6తో సంచలన విజయాన్ని అందించాడు.చివరి ఓవర్లో గొడవ తలెత్తినా.. ప్రశాంతంగా ఆడిన మహ్మదుల్లా అద్భుత షాట్లు కొట్టి జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకు ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ ఒక్కరొక్కరుగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. బంగ్లా బౌలర్లధాటికి 9 ఓవర్లలో 43 పరుగులకే కీలకమైన 5 వికెట్లను కొల్పోయింది శ్రీలంక. ఈదశలో జట్టును ఆదుకున్నారు కుశాల్ పెరీరా,తిశార పెరీరా. కుశాల్ 61 పరుగులు చేయగా తిశార 58 పరుగులతో రాణించారు. దీంతో లంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కొల్పోయి 159 పరుగులు చేసింది. బంగ్లా గెలుపులో కీలకపాత్ర పోషించిన మహ్మదుల్లాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.

