నిజంగానే నాకు.. నా ప్రాంతానికి ఏదో చేయాలనే ఆశ లేకపోతే, నేను హైదరాబాద్‌లోనో, వైజాగ్‌లోనో స్టూడియో కట్టుకోవటానికి స్థలం కావాలని అడుగుతాను. కానీ వెనుకబడిన ప్రాంతంగా చూసే మదనపల్లిలో ఎందుకు స్టూడియో కట్టాలనుకుంటున్నాను’’ అని అంటున్నారు దర్శక నిర్మాత మహి వి.రాఘవ్. ప్రస్తుతం ఆయన తెరకెక్కించిన ‘యాత్ర 2’ ఇటీవల విడుదలైంది. ఈ సినిమా చేసిన దానికే మదనపల్లిలోని హర్సిలీ హిల్స్‌లో ఏపీ ప్రభుత్వం… మహి వి.రాఘవ్‌కి స్టూడియో నిర్మాణం కోసం రెండెకరాలు భూమి ఇచ్చిందంటూ ఓ వర్గానికి చెందిన మీడియాలో ఆరోపణలు వచ్చాయి.
దీనిపై మహి.వి.రాఘవ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ ..నేను రచయిత, నిర్మాత, దర్శకుడిగా సినీ పరిశ్రమలో ఇండస్ట్రీలో 16 ఏళ్లుగా ఉంటున్నాను. 2008లో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టాను. మూన్ వాటర్ పిక్చర్స్, 3 ఆటమ్ లీవ్స్ అనే రెండు నిర్మాణ సంస్థలను స్థాపించాను. నిర్మాతగా, దర్శకుడిగా అందరికీ సుపరిచితుడినే. విలేజ్‌లో వినాయకుడు, కుదిరితే కప్పు కాఫీ, పాఠశాల, ఆనందో బ్రహ్మ, యాత్ర, సిద్ధా లోకం ఎలా ఉంది, యాత్ర 2 సినిమాలను .. అలాగే సేవ్ ది టైగర్స్, సైతాన్ అనే వెబ్ సిరీస్‌లను రూపొందించాను. నేను రాయలసీమ ప్రాంతంలోని మదనపల్లిలోనే పుట్టి పెరిగాను.. అక్కడే చదివాను. సినీ పరిశ్రమలో రాయలసీమ ప్రాంతానికి పెద్దగా ప్రాధాన్యం ఉండదు. అంటే అక్కడ షూటింగ్స్ చేయటానికి ఎవరూ ఆసక్తి చూపించరు. నా ప్రాజెక్ట్స్‌లో ఆనందో బ్రహ్మ, సేవ్ ది టైగర్స్ అనే వెబ్ సిరీస్‌లను రాయలసీమలో తెరకెక్కించలేదు. పాఠశాల, యాత్ర 2, సిద్ధా లోకమెలా ఉంది, సైతాన్ వెబ్ సిరీస్ రాయలసీమలోనే చిత్రీకరించాను. మరీ ముఖ్యంగా ఈ రెండేళ్లలో సైతాన్, యాత్ర 2, సిద్ధాలోకం అనే మూడు ప్రాజెక్ట్స్‌ను మదనపల్లి, కడప ప్రాంతాల్లో రూపొందించాం. మూడు ప్రాజెక్ట్స్‌కి దాదాపు రూ.20 నుంచి 25 కోట్ల రూపాయలను ఖర్చు చేశాను. అందుకు కారణం నేను పుట్టి పెరిగిన ప్రాంతానికి నా వంతుగా ఏదో చేయాలనే ఉద్దేశమే. అందుకోసమే నేను సంపాదించిన డబ్బుని అక్కడ ఖర్చు పెట్టాను. అక్కడ సినిమాలు చేయటం వల్ల లాడ్జీలు, హోటల్స్, భోజనాలు, జూనియర్స్ ఇలా పలు రకాలుగా స్థానికులు ఉపయోగం ఉంటుందని భావించాను. ఈ జర్నీలో నేను వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రాయలసీమలో మినీ స్టూడియో నిర్మించాలనుకున్నాను. అందువల్ల లోకల్ జనాలకు ఉపయోగంగా ఉంటుందని ఆలోచించాను.
బుద్ధి ఉన్నోడెవడైనా దీన్ని ఆలోచించాలి. నేనేమీ స్టూడియో నిర్మాణం కోసం యాబై, వంద ఎకరాలు అడగలేదు. నేను కేవలం రెండు ఎకరాల్లో మాత్రమే మినీ స్టూడియో నిర్మించాలనుకున్నాను. దాని వల్ల అక్కడెవరైనా షూటింగ్స్ చేసుకోవాలనుకుంటే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. అందరికీ ప్రాథమిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. అందులో తప్పేముంది.. చేయనివారు ఎలాగూ చేయరు. ఇన్నేళ్లు ఇండస్ట్రీ ఉంటుంది కదా, రాయలసీమకు ఎవడైనా ఏమైనా చేశారా! ఎవరూ ఏమీ చేయలేదు. మీరు చేయరు… చేసేవాడిని చెయ్యనియ్యరు. ఓ వర్గం మీడియా దీని గురించి కాస్త కూడా ఆలోచించలేదు. వాళ్లకి ప్రియమైన ప్రభుత్వం ఎవరెవరికీ భూములను ఎక్కడెక్కడిచ్చింది.. వాళ్లకు నచ్చినవాళ్లకు, ఇష్టమైన వాళ్లకు భూములను ఇచ్చుకుంది. వీటి గురించి ఎవరూ మాట్లాడరు. నేను నా ప్రాంతంలో కేవలం రెండు ఎకరాల్లో, అక్కడి ప్రజలకు ఉపయోగపడే ఉద్దేశంతో మినీ స్టూడియో కట్టాలని అనుకుంటే మాత్రం రాద్ధాంతం చేస్తున్నారు’’ అన్నారు.
Also Read:భారీగా పెరిగిన ఎన్టీఆర్ మార్కెట్