మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘స్పైడర్’ సినిమా, ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుపుకుంటోంది. మహేష్ బాబు స్పైడర్ కు.. ఇప్పుడు మరోసారి క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నారని ఇప్పటికే చెప్పుకున్నాం. హైద్రాబాద్ లో మొదలైన షూటింగ్.. ఇప్పుడు చెన్నైకు చేరిందనే సంగతి కూడా పాత విషయమే. అయితే.. అసలు మహేష్ అండ్ మురుగ టీంకు హైద్రాబాద్ లో ఎదురైన ఇబ్బంది ఏంటి.. ఎందుకు హైద్రాబాద్ నుంచి హఠాత్తుగా మకాం మార్చాల్చి వచ్చిందనే సంగతి ఇప్పుడు తెలియవచ్చింది.
గోవా నుంచి తిరిగొచ్చిన మహేష్ బాబు గత వారం చివరలోనే స్పైడర్ షూటింగ్ లో పాల్గొన్నాడు. బీబీనగర్ లోని నిమ్స్ లో షూటింగ్ మొదలుపెట్టారు కూడా. అయితే.. స్థానిక ప్రజలు.. అక్కడి రాజకీయ నాయకులు దీనికి అభ్యంతరాలు వ్యక్తం చేశారట. షూటింగ్ జరగనీయకుండా ఆందోళన వ్యక్తం చేశారని కూడా అంటున్నారు. ఇంకా నిర్మాణమే పూర్తి స్థాయిగా జరపకుండా.. కార్యకలాపాలు ప్రారంభించకుండా.. సినిమా షూటింగ్ లకు ఎలా అనుమతులు ఇస్తారని నిలదీశారట. ఈ పరిస్థితిని గమనించిన మహేష్ అండ్ టీం.. వెంటనే చెన్నైకు మకాం మార్చేశారని తెలుస్తోంది.’నిమ్స్ లోనే షూటింగ్ చేయాలని భావించాం. కానీ ఆ ప్రాంతం చట్టపరమైన సమస్యల్లో ఉందని ఆలస్యం తెలిసింది. అక్కడేమీ ఆందోళనలు జరగలేదు. అయితే.. అనవసరమైన సమస్యలు ఎదురుకాకుండా ఉండేందుకే.. చెన్నైలో షూటింగ్ జరపాలని నిర్ణయించాం. ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో పనులు జరిగిపోతున్నాయి’ అని చెబుతున్నారు స్పైడర్ చిత్ర నిర్మాత ఎన్ వి ప్రసాద్.
అయితే ఈ క్లైమాక్స్ కి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను చెన్నైలో చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీలో ఒక ముఖ్యమైన పాత్రలో నయనతార కనిపించనుందనే టాక్ తాజాగా వినిపిస్తోంది.ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర ఉండటంతో, ఆ పాత్రలో నయనతార కనిపిస్తే బాగుంటుందని భావించిన మురుగదాస్ ఆమెను సంప్రదిస్తున్నాడట. గతంలో ‘గజిని’ సినిమాలో మురుగదాస్ ఇచ్చిన పాత్ర నయన్ కెరియర్ కి ఎంతో హెల్ప్ అయింది. కనుక మురుగదాస్ కి ఆమె నో చెప్పే ఛాన్స్ లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.