కొరటాల మహేష్-ప్రిన్స్ మహేష్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం భరత్ అనే నేను. రేపు(ఈనెల 20న)సినిమా విడుదల కానుండగా ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న మహేష్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. గతంలో సినిమాల విషయంలో అనేక ప్రయోగాలు చేశానని ఇకపై తనకు ఆ ఉద్దేశం లేదని చెప్పారు. ప్రయోగాలు చేసే ఓపిక లేదు….ఏవైనా ప్రయోగాలు చేసినా, నాన్నగారి అభిమానులు ఊరుకోరు. డైరెక్టుగా మా ఇంటికొచ్చి నా మీద ఎటాక్ చేసినా చేస్తారు అంటూ తెలిపారు.
ఇక ఈ సినిమాలో మహేష్ సీఎంగా నటిస్తుండగా నిజజీవితంలో రాజకీయాల్లోకి రానున్నారా అని ప్రశ్నించగా పాలిటిక్స్‌లోకి వచ్చే ఉద్దేశం లేదని చెప్పారు. సినిమా అంటేనే ప్రాణమని…నాజీవితం మొత్తం కూడా సినిమాకే అంకితమన్నారు. దర్శకుడు కొరటాల శివ ఏడాది క్రితం ఈ కథ గురించి చెప్పినప్పుడు చాలా ఆసక్తిగా అనిపించింది. అదే సమయంలో భయంగా కూడా అనిపించింది. ముఖ్యమంత్రి పాత్ర అనేసరికి భయపడ్డానని తెలిపారు.
సినిమా కోసం దర్శకుడు శివ పడిన కష్టం గురించే ప్రత్యేకంగా చెప్పాలి. రాజకీయంతో కూడిన ఓ సినిమా కథని, సంభాషణల్ని రాయడం మామూలు విషయం కాదన్నారు. ఈ సినిమాలో రాజకీయాలపై ఎలాంటి వ్యంగ్యాస్త్రాలు ఉండవని…ఏ పార్టీని టార్గెట్ చేయలేదన్నారు. కళా దర్శకుడు సురేష్ వేసిన అసెంబ్లీ సెట్టు, దేవిశ్రీప్రసాద్ సంగీతం, తిరు, రవి.కె.చంద్రన్ కెమెరా పనితనం, యుగంధర్ విజువల్ ఎఫెక్ట్స్… ఇలా అన్నీ కూడా అద్భుతంగా కుదిరాయి. కైరా అడ్వాణీ చాలా బాగా నటించిందన్నారు.
పెద్ద సినిమాలు విజయవంతమైతే వాటికి ఆకాశమే హద్దు. తొలి రోజు ఉదయం ఆటతో సినిమాకి మంచి టాక్ వచ్చిందంటే ఇక వసూళ్లు నమ్మశక్యంగా ఉండవు. ఇటీవల ‘రంగస్థలం’ విజయవంతం కావడం చాలా ఆనందంగా ఉందన్నారు.