కొత్త డీజీపీగా మహేందర్ రెడ్డి..

225
Mahender Reddy is new DGP
- Advertisement -

రాష్ట్ర నూతన డీజీపీ (కోఆర్డినేషన్)గా ముదిరెడ్డి మహేందర్‌రెడ్డిని ప్రభుత్వం నియమిస్తూ డీజీపీగా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలను అప్పగించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుక్రవారం రాత్రి సంతకంచేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ఉత్తర్వులు జారీచేశారు. మహేందర్‌రెడ్డి కంటే నలుగురు సీనియర్లు తేజ్‌దీప్‌ కౌర్‌ మీనన్‌, కృష్ణప్రసాద్‌, రాజీవ్‌ త్రివేది, సుదీప్‌ లాక్టాకియా డిజిపి రేసులో ఉన్నా, వారిని పక్కనబెట్టి మహేందర్‌ రెడ్డి వైపే సిఎం మొగ్గు చూపారు.  హైదరాబాద్‌ పోలీసు తాత్కాలిక కమిషనర్‌గా సీనియర్‌ ఐపిఎస్‌ అధికారి వివి శ్రీనివాసరావును ప్రభుత్వం నియమించింది.

1986 ఐపీఎస్ క్యాడర్‌కు చెందిన మహేందర్‌రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుత డీజీపీ అనురాగ్‌శర్మ ఆదివారం పదవీ విరమణ పొందనున్నారు. అనంతరం ఆయన స్థానంలో మహేందర్‌రెడ్డి బాధ్యతలు చేపడుతారు.

పదవీ విరమణ పొందనున్న అనురాగ్‌శర్మ సేవలను వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో పోలీసు వ్యవస్థ బలోపేతానికి ఆయనచేసిన కృషిని గౌరవిస్తూ.. ఆయనను రాష్ట్ర హోంశాఖ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఆయన క్యాబినెట్ హోదాలో మూడు సంవత్సరాలు పాటు ఈ పదవిలో కొనసాగుతారు.

మహేందర్‌రెడ్డి స్వస్థలం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కిష్టాపురం. 1962 డిసెంబర్ 3న రైతు కుటుంబంలో జన్మించారు. వరంగల్ ఆర్‌ఈసీ నుంచి బీటెక్ (సివిల్) పూర్తిచేశారు. ఢిల్లీ ఐఐటీలో ఎంటెక్ చదువుతుండగానే 1986లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. పలు జిల్లాల్లో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన.. సైబరాబాద్ కమిషనర్‌గా, ఇంటెలిజెన్స్ చీఫ్‌గా, గ్రేహౌండ్స్ ఐజీగా వ్యవహరించారు. 2014 జూన్ 2 నుంచి హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా వ్యవహరిస్తున్న మహేందర్‌రెడ్డి.. సిటీ పోలీస్‌ను పీపుల్స్ ఫ్రెండ్లీగా మార్చారన్న పేరుతెచ్చుకున్నారు. ఇండియన్ పోలీస్ మెడల్, ప్రెసిడెంట్ పోలీస్ మెడళ్లను అందుకున్నారు. నేషనల్ పోలీస్ అకాడమీలో ఫ్యాకల్టీగా పనిచేశారు. యూఎస్, యూకే దేశాల్లో పోలీస్ వ్యవస్థపై అధ్యయనం చేసివచ్చారు.

- Advertisement -