దసరా పండుగ సందర్భంలో పెద్ద సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తుండగానే, ‘మహానుభావుడు’ రంగంలోకి దిగింది. భలే భేలే మగాడివోయ్ ఫేం మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కంటెంట్ అన్నివర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ కావడంతో, భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. తొలివారంలో ఈ సినిమా 32.2 కోట్లు రాబట్టినట్టు ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా తెలిపారు.
వసూళ్ల విషయంలో ఈ సినిమా ఇదే జోరును కొనసాగిస్తే 50 కోట్ల మార్క్ ను టచ్ చేసే ఛాన్స్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శర్వానంద్ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా మహానుభావుడు విశేషం. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై గతంలో ‘రన్ రాజా రన్’ .. ‘ఎక్స్ ప్రెస్ రాజా’ చేసిన శర్వానంద్, ‘మహానుభావుడు’తో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. మెహ్రీన్ కి కూడా ఈ సినిమా సక్సెస్ బాగా కలిసొచ్చిందనే టాక్ వినిపిస్తోంది.
ఈ ఏడాది సంక్రాంతికి చిరు ఖైదీ నెంబర్ 150, బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి వంటి పెద్ద సినిమాల మధ్య విడుదలైన శర్వానంద్ శతమానంభవతి మంచి వసూళ్లను రాబట్టింది. తాజాగా ఎన్టీఆర్ జై లవకుశ, మహేష్ స్పైడర్‌తో పోటీ పడి విడుదలైన ఈ సినిమా వసూళ్లలో ఏమాత్రం తగ్గడం లేదు.
ఇక మహానుభావుడుతో మరో హిట్టు తన ఖాతాలో వేసుకున్న శర్వా..మరో రెండు సినిమాలు లైన్ పెట్టినట్టు సమాచారం. అందులో ఒకటి ‘స్వామిరారా’.. ‘కేశవ’ చిత్రాల దర్శకుడు సుధీర్ వర్మతో కాగా.. ఇంకోటి రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడితో చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ ఏడాది శర్వానంద్‌కు బాగానే కలిసివచ్చింది.