ప్రజాకూటమి .. వీడని పీటముడి..!

206
telangana prajakutami
- Advertisement -

ప్రజాకూటమి పొత్తులపై మహా చర్చలు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటుండంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీడీపీతో పాటు సీపీఐ,టీజేఎస్‌..కాంగ్రెస్‌తో కలిసి ప్రజాకూటమిగా ఎన్నికల సమరానికి సిద్దమవుతున్నాయి. పొత్తు అయితే పొడిచింది కానీ సీట్ల పంపకాలే ఇంకా ఖరారు కాలేదు. పలుదఫాలుగా పోటీ చేసే స్ధానాలపై చర్చలు జరుగుతున్నా ఏకాభిప్రాయానికి మాత్రం రాలేక పోతున్నారు కూటమి నేతలు.

ఇక కాంగ్రెస్‌తో పొత్తు వెంటిలెటర్‌పై ఉన్న టీడీపీ అనివార్యం. దీంతో ఆ పార్టీ ఎన్ని సీట్లు ఇచ్చినా ఓకే చెప్పేందుకు టీడీపీ సిద్ధంగా ఉంది. కానీ టీజేఎస్,సీపీఐ మాత్రం తాము కోరిన స్ధానాలు ఇవ్వాలని పట్టుబడుతున్నాయి. టీజేఎస్ 20,సీపీఐ 9 సీట్లు అడుగుతుండగా అన్ని సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. దీంతో ప్రజాకూటమిలో సీట్ల పంపకాల పీటముడి వీడటం లేదు.

ఇక పొత్తులో భాగంగా టీడీపీ కోరిన కొన్నిసీట్లలో సైతం కాంగ్రెస్‌ నుంచి రెబల్ అభ్యర్థులు బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా టీడీపీ కూకట్ పల్లి,శేరిలింగపల్లి,ఖమ్మం అసెంబ్లీ స్ధానాలను అడుగుతుండగా ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల నుంచి గట్టిపోటి ఎదురవుతోంది.

ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు,కూకట్ పల్లి నుంచి పెద్దిరెడ్డి,శేరిలింగంపల్లి నుంచి పెన్నా సిమెంట్స్ అధినేత బరిలోకి దిగనున్నారని వార్తలు వెలువడుతున్నాయి. అయితే వీరికి కాంగ్రెస్‌ నుంచి రెబల్‌ పోటు తప్పెలా కనిపించడం లేదు. ముఖ్యంగా కూకట్‌పల్లి నుంచి సీటు ఆశీస్తున్న పెద్దిరెడ్డి గత ఎన్నికల్లో హుజురాబాద్‌ నుంచి ఓటమిపాలయ్యారు. అక్కడ నాలుగోస్ధానానికి పరిమితమైన ఆయన ఈ సారి సెటిలర్లు ఎక్కువగా ఉండే కూకట్‌పల్లి ప్రాంతాన్ని ఎంచుకున్నారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ నుంచి సెటిలర్‌,ఆ పార్టీ సీనియర్ నేత ఏలూరి రామచంద్రారెడ్డి నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది.

ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ ఎక్కడో ఒకచోట సెటిలర్స్ కు రెండు సీట్లు ఇవ్వాలని టీపీసీసీకి సూచించాడట. దీంతో కూకట్‌పల్లి సీటు తనకే దక్కుతుందని రామచంద్రారెడ్డి ధీమాతో ఉన్నారని సమాచారం. దీంతో పెద్దిరెడ్డి ఆశలు అడియాశలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఒకవేళ సీటు వచ్చినా రెబల్ అభ్యర్థులు బరిలో ఉండటం ఖాయం కావడం ఆయన పోటీ చేసే విషయంలో ఏటూ తేల్చుకోలేకపోతున్నారు.

ఇక నల్గొండ,గ్రేటర్ పరిధిలోని పలు సెగ్మెంట్ల విషయంలో కూడా ఇదే పరిస్థితి ఉండటంతో ప్రజాకూటమి సీట్ల పంపకాల విషయం ఇప్పుడే తేలేలా కనిపించడం లేదు. మొత్తంగా పొత్తులు పొసుగుతాయా..? సీట్ల సర్దుబాట్లు అంత తేలిగ్గా తేలిపోతాయా..? అన్నది మరికొద్దిరోజుల్లో తేలనుంది.

- Advertisement -