మహబూబ్‌నగర్ జిల్లాలోని క్రిస్టియన్‌పల్లి సమీపంలో ఉన్న ఆదర్శనగర్‌లో దళిత పేదల ఇళ్ల కూల్చివేత అంశం మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. ఏడాదిన్నర క్రితం అర్ధరాత్రి 12 గంటల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఇళ్లను కూల్చివేసిందని బాధితులు ఆరోపిస్తున్నారు. “పిల్లలతో సహా రోడ్డుపైకి వచ్చాం. చెప్పుకునే వాళ్లెవ్వరూ లేరు” అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా బాధితులు బహిరంగంగా ప్రచారం చేస్తున్నారు. “రేవంత్ రెడ్డి ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఆయన మాటలన్నీ అబద్ధాలే” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. తమకు ఇళ్లను కూల్చే ముందు ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని, పునరావాసం కల్పించలేదని వారు ఆరోపిస్తున్నారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని బాధితులు ప్రజలను కోరుతూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదర్శనగర్‌లో కూల్చివేసిన పేదల ఇళ్ల ప్రాంతాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. బాధితులతో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు. పేదల ఇళ్లను అర్ధరాత్రి కూల్చివేయడం అన్యాయమని, బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని శ్రీనివాస్ గౌడ్ హామీ ఇచ్చారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Also Read:TTD:మహాశివరాత్రి ఆధ్యాత్మిక వైభవం

