హిందువులు పౌర్ణమి తిథిని చాలా పవిత్రంగా భావిస్తారు. పౌర్ణమి తిథి ప్రతి నెల శుక్లపక్షంలోని చివరి తేదీ.. కొత్త నెల ఆ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 12 న వచ్చింది. ఈ రోజున దాతృత్వం , గంగా స్నానం చేయడం మిక్కిలి ఉత్తమం. ఈరోజున చంద్రుడు తన పూర్తి కళలతో ఉదయిస్తాడని చెబుతుంటారు.
చైత్రాది పన్నెండు మాసాలకూ ఏదో ఒక ప్రత్యేకత వుంది.
కార్తీక మాసం దీపాలకూ , దీపారాధనలకు ప్రసిద్ధి.
మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి.
“మా – అఘం” అంటే పాపం ఇవ్వనిది అని అర్థం. కనుకనే మాఘమాసం అన్నారు.
“మాఘమాసేరటం తాప్యః కించి దభ్యుదితే రవౌ
బ్రహ్మఘ్నం వా సురాపం వా కంపతంతం పునీమహే”
“ఈ మాఘమాసమందు సూర్యోదయమునకు పూర్వమే , అనగా … బ్రాహ్మీముహూర్తము నుంచి జలములన్నియు బ్రహ్మహత్య , సురాపానము వంటి మహా పాతకములను పోగొట్టి మానవులను పవిత్రులుగా చేయుటకు సంసిద్ధముగా వుండును” అని అర్థం.
అందుకనే మాఘమాసం నెలరోజులు పవిత్రస్నానాలు చేయాలని మన ఋషులు నిర్ణయించారు.
మాఘం అమోఘం :
మాఘమాసానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ మాసానికి పరిపోషకుడు మాధవుడు. “మా” అంటే మహాలక్షీ. “ధనుడు” అంటే భర్త. మాధవుడు అంటే లక్ష్మీదేవికి భర్త అని అర్థం. అందుకే శ్రీమహాలక్ష్మీ కూడా ఈ మాసాన్ని ఎంతగానో ఇష్టపడుతుంది. లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన మాసం కనుక శ్రీవైష్ణవులకు ఈ మాఘమాసం ఎంతో ప్రధానమైనది. విద్యాధిదేవత , వాగ్దేవి , జ్ఞానప్రదాయిని అయిన సరస్వతీదేవి ఈ మాఘమాసంలోనే శుద్ధ పంచిమినాడు జన్మించింది. అందుకే మాఘశుద్ధ పంచమిని “శ్రీపంచమి” అని అంటారు. “శ్రీ” అంటే లక్ష్మీదేవి అనే కదా మనందరి అభిప్రాయం.
“శుద్ధలక్ష్మీ: మోక్షలక్షీ: జయలక్ష్మీహ సరస్వతే
శ్రీర్లక్ష్మీ: వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమసర్వదా”
మానవునకు అవసరమైన ఆరు సంపదలలోను విద్యాసంపద ఒకటి. కనుకనే శ్రీమహాలక్ష్మీ “శ్రీపంచమి” నాడు సరస్వతీదేవి రూపంలో భాసిస్తుంది. ఈ రోజునే తల్లిదండ్రులు తమ పిల్లలకు “అక్షరభ్యాసం” జరిపిస్తారు. ఈ మాఘమాసంలోనే ఆరోగ్యప్రదాత అయిన సూర్యుడు సప్తమి తిథినాడు జన్మించాడు. అందుకే మాఘశుద్ధసప్తమి “రథసప్తమి” పర్వదినం అయింది. లయకారుడైన పరమేశ్వరుడు లింగాకారంలో ఉద్భవించి మాఘ బహుళ చతుర్ధశిని “శివరాత్రి” పర్వదినం చేశాడు. విష్ణుసహస్రనామ స్తోత్రాన్ని సర్వమానవాళికి అందించిన భీష్మ పితామహుడు ఈ మాఘ శుద్ధ అష్టమినాడు పరమపదం చేరి , మాఘశుద్ధ ఏకాదశి “భీష్మ ఏకాదశి” పర్వదినం చేశాడు.
Also Read:కర్బూజ పండు తింటున్నారా..జాగ్రత్త!
త్రిమతాచార్యులలో ఒకరైన “మధ్వాచార్యుడు” ఈ మాఘశుద్ధ నవమినాడు వైకుంఠ ప్రాప్తి పొందాడు. ఈ రోజున ఉడిపి కృష్ణుని మనం చూడగలుతున్నామంటే అందుకు మధ్వాచార్యుని కరుణాకటాక్షమే కారణం. అందుకే మాఘశుద్ద నవమిని “మధ్వనవమి” గా పాటిస్తూ ఉడిపి క్షేత్రంలో ఎంతో కోలాహాలంగా కృష్ణునికి విశేషమైన ఉత్సవాలు , వేడుకలు చేస్తారు.జ్యోతిషశాస్త్ర ప్రకారం ఈ మాసాన్ని “కేతువు” పరిపాలిస్తూంటాడు. కేతువు జ్ఞానప్రదాత , మోక్షకారకుడు. కనుక ఈ మాసంలో కేతువు విశేష పూజలు అందుకుంటాడు.
చాంద్రమానం ప్రకారం చంద్రుడు “మఖ” నక్షత్ర మండలంతో కూడి వుండే మాసం కనుక ఈ మాసానికి “మాఘమాసం” అనే పేరు వచ్చింది. అందుకే మాఘం – అమోఘం .
మాఘ అమావాస్య పితృకార్యాచరణకు ఎంతో ప్రధానమైన రోజు. ఆ రోజున పైతృకం చేస్తే పితృదేవతలు పదివేల సంవత్సరాల పాటు స్వర్గసుఖాలు అనుభవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. సాధారణంగా గ్రహణకాలాలు, సంక్రమణాలు “పైతృకాలకు” ఎంతో అనువైన కాలాలుగా భావిస్తారు. అయితే , ఆదివారం , అమావాస్య , శ్రవణనక్షత్రం , వ్యతీపాత యోగం అన్నీ ఒకేరోజున కలిసివస్తే దాన్ని “అర్ధోదయ పుణ్యకాలం” అంటారు. అది గ్రహణకాలం కన్నా గొప్పదని శాస్త్రాలు చెబుతున్నాయి. పైగా మాఘ అమావాస్య , శతభిష నక్షత్రంలో కూడి వుంటే మరింత విశేషమని ధర్మసింధువు చెబుతుంది. కనుక , ఈ మాఘ అమావాస్య నాడు పితృదేవతలను స్మరిస్తే, పుత్రధర్మాన్ని నిర్వర్తించిన వారిమౌతాం.
మాఘమాసం స్నానాలకు ప్రసిద్ధి అని చెప్పుకున్నాం కదా ! నిజానికి మకర సంక్రమణం జరిగినది మొదలు కుంభసంక్రమణం జరిగేవరకు మధ్య ఉండే మధ్యకాలమే “మాఘమాసం”. పవిత్రస్నానాలు పౌష్య శుక్ల పూర్ణిమతో మొదలై మాఘశుక్ల పూర్ణిమతో ముగుస్తాయి. చాంద్రమానం అనుసరించేవారికి ఈ మాఘమాసం పౌష్య బహుళ అమావాస్యతో ప్రారంభమై మాఘ బహుళ అమావాస్యతో ముగుస్తుంది. ఈ మాఘమాసం మొత్తం పవిత్రస్నానాలు చేయడం విశేష పూర్వప్రదం. కానీ , ఈ యాంత్రిక జీవితంలో అది సాధ్యం కానీ పని తెలిసే … కనీసం “మాఘపూర్ణిమ” నాడైనా నదీస్నానం గానీ , సముద్రస్నానం గానీ చేస్తే మాఘమాసం మొత్తం పవిత్రస్నానాలు చేసిన ఫలితం వస్తుందని పెద్దలంటారు. ఎందుకంటే మాఘపూర్ణిమను “మహామాఘి” అని అంటారు. సంవత్సరంలో వచ్చే 12 పూర్ణిమలలోనూ “మాఘ పూర్ణిమ” అత్యంత విశేషమైనది. ఈ “మహామాఘి” శివ , కేశవులిద్దరికీ ప్రీతికరమైనది. అందుకే ఈ మాఘ పూర్ణిమ నాడు తప్పకుండా సముద్రస్నానం చేసితీరాలి. శివ , కేశవులిద్దరినీ ఆరాధించి తరించాలి.