సూపర్ స్టార్ రజినికాంత్ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ జోరుగా వార్తలు చక్కర్లుకొట్టాయి. రజిని రాజకీయాల్లోకి రావాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. మరోవైపు వివిధ రాజకీయ పార్టీలు సైతం ఆయనకున్న ఫాలోయింగ్ దృష్ట్యా మద్దతు కోసం ఆయన్ను పలు సందర్భాల్లో కలవడానికి ప్రయత్నించింది కూడా తెలిసిందే.
దీంతో ఎప్పటికప్పుడు రజిని రాజకీయ ప్రవేశం చర్చనీయాంశం అవుతోంది…. అయితే దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత సోమవారం రజనీకాంత్ తన అభిమానులను ప్రత్యక్షంగా కలుసుకున్నారు. తన అభిమానులతో సమావేశమవుతున్న సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘తాను రాజకీయాల్లోకి రావలసిన పరిస్థితి వస్తే, తప్పకుండా వస్తా’నని చెప్పిన విషయం తెలిసిందే.
ఈ వ్యాఖ్యలపై పలువురు తమదైన శైలిలో స్పందిస్తున్న నేపథ్యంలో నటుడు మాధవన్, దర్శక నటుడు చేరన్ తదితరులూ తమ అభిప్రాయాలు వెల్లడించారు. చెన్నైలో మంగళవారం మాధవన్ విలేకరులతో మాట్లాడుతూ… ఏది మంచిదో రజనీకాంత్‌కు బాగా తెలుసని, ఆయన రాజకీయాల్లోకి వస్తే మంచిదేనన్నారు.
ఆయన రాజకీయాల్లోకి వస్తే స్వాగతిస్తానని తెలిపారు. నట దర్శకుడు చేరన్ మాట్లాడుతూ ఎలాగైనా రజనీకాంత్‌ను అభిమానులు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడతారని, రాజకీయ పరిస్థితులు అందుకు అనుకూలిస్తాయని తెలిపారు. ప్రజల్లో నేడు నిజాయతీ కొరవడిందని, అందువల్ల రజనీకాంత్ జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
దోపిడీ, అవినీతి, స్వార్థం కలగలిసిన ఈ రాజకీయాలు సరిపోతాయా? అని రజనీకాంత్ ఆలోచించుకోవాలని పేర్కొన్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే కర్ణాటకను వ్యతిరేకించాలని, హిందీకి మద్దతివ్వకూడదని, ఉచితాలు ఇవ్వాల్సిందేనని, మద్యం దుకాణాలను మూసివేయకూడదని, ఇలా పలు సవాళ్లు ఉన్నాయని తెలిపారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలంటే క్షేత్రస్థాయిలో పని చేసి ప్రజలతో మాట్లాడాలని, వారి సమస్యలు తెలుసుకోవాలని సూచించారు.