తెలంగాణ ఫుడ్స్ చైర్మన్‌గా మేడె రాజీవ్ సాగర్..

340
- Advertisement -

తెలంగాణ ఫుడ్స్ చైర్మన్‌గా మేడె రాజీవ్ సాగర్, తెలంగాణ అధికార భాషా సంఘం చైర్మన్‌గా మంత్రి శ్రీదేవి, తెలంగాణ ఉర్దూ అకాడెమీ చైర్మన్‌గా మహమ్మద్ ఖాజా ముజీబుద్దీన్ లను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు. సీఎం నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు వీరికి సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఇక వీరి వ్యక్తిగత వివరాల విషయానికొస్తే..

మేడే రాజీవ్ సాగర్ గురించి..
మేడే రాజీవ్ సాగర్, తండ్రి – కీర్తి శేషులు మేడే వినయ్ సాగర్. విద్యార్హత – ఎమ్మెస్సీ కెమిస్ట్రీ. ఈయన తెలంగాణ జాగృతి నిర్మాణంలో ముఖ్య భూమిక పోషించారు. తెలంగాణ జాగృతిని గ్రామస్థాయి వరకు తీసుకెళ్ళి తెలంగాణ వాదాన్ని వినిపించారు. 2006-2008 వరకు తెలంగాణ జాగృతి కోశాధికారిగా పనిచేశారు. 2008 నుంచి 2014 వరకు తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2014 నుంచి ఇప్పటివరకు జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నారు. టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ అనుబంధ క్రైస్తవ సామాజికవర్గ సేవా కార్యక్రమాలు చేపట్టారు. టిఆర్ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచేందుకు కీలక సందర్భాల్లో క్రైస్తవ మీటింగ్‌లు నిర్వహించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో టిఆర్ఎస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొని జనసమీకరణ చేపట్టారు. అంతేకాదు మలిదశ తెలంగాణ ఉద్యమంలో నిర్వహించిన సకల జనుల సమ్మెలో సబ్బండ వర్గాలను సమీకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఉద్యమ సమయంలో విద్యార్థులకు బాసటగా నిలిచి వారి అవసరాలు తీర్చారు రాజీవ్ సాగర్. మిలియన్ మార్చ్, సాగరహారం కార్యక్రమాలకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వేలాది మందిని సమీకరించి కార్యక్రమాలను ఫలవంతం చేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కంప్యూటర్ శిక్షణ, కంప్యూటర్ సెంటర్, జాబ్ మేళాలు, మెడికల్ క్యాంపులు, కళ్ళద్దాల పంపిణీ చేశారు. తెలంగాణ ప్రాచీన చరిత్రను వెలికితీసేందుకు కృషి చేస్తున్నారు. నల్లమల అడవుల పరిరక్షణ, చెంచుల హక్కుల పరిరక్షణకు ఉద్యమించారు రాజీవ్ సాగర్.

మహ్మద్ ఖాజా ముజీబుద్దీన్ గురించి..
కామారెడ్డికి చెందిన మహ్మద్ ఖాజా ముజీబుద్దీన్, తండ్రి కీ.శే. ఖాజా మోయినుద్దీన్. ఈయన 1968 జనవరి 30న జన్మించారు. బి.ఎ.ఎల్.ఎల్.బి వరకు చదువుకున్నారు. ముజీబుద్దీన్ న్యాయవాదిగా పనిచేస్తూ వ్యాపారం కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. 1984-85 లో కామారెడ్డి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో విద్యార్థి సంఘానికి అధ్యక్షుడుగా, 1995-2000, 2000-2005 రెండు పర్యాయములు మున్సిపల్ కౌన్సిలర్‌గా, 2013-2019 లో నిజామాబాద్ డిసిఎంఎస్ చైర్మన్‌గా పని చేశారు, 2004-2010 వరకు టిడిపి పార్టీకి కామారెడ్డి టౌన్ ప్రెసిడెంట్‌గా, 2017-2022 టిఆర్ఎస్ పార్టీ మైనారిటీ సెల్ ప్రెసిడెంట్‌గా పదవులను నిర్వహించారు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు భాషలలో అనర్గలంగా మాట్లాడగలరు ముజీబుద్దీన్.

శ్రీదేవి మంత్రి గురించి..
మేడ్చల్ మాల్కాజిగిరి జిల్లా నారపల్లికి చెందిన మంత్రి శ్రీదేవి, తండ్రి మంత్రి శశిభూషన్ రావు, ఈమె 1971 జనవరి 2న జన్మించారు. బిఎస్ప్సీ, బిజడ్సీ చదివారు. టిఆర్ఎస్ పార్టీలో 2004లో చేరారు. అప్పటి నుండి టిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు.

- Advertisement -