మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎలక్షన్స్ సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఆరోపణలు,ప్రత్యారోపణలతో ముందుకుసాగుతున్నారు నరేష్,శివాజీ రాజా ప్యానల్ సభ్యులు. గత ఎన్నికల్లో అధ్యక్ష కార్యదర్శులుగా చేసిన శివాజీరాజా, నరేష్‌లు ప్రత్యర్థులుగా ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ పడుతున్నారు.గతంలో జరిగిన ఎన్నికల వేడిన రెట్టింపూ చేస్తూ..ఒకరిపై ఒకరు తీవ్రస్ధాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. సుమారు 800 మంది మూవీ ఆర్టిస్ట్‌లకు జరిగే ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు నువ్వా నేనా పోటీ పడుతున్నారు నరేష్, శివాజీ రాజా ప్యానల్స్.
అయితే మొన్నటి వరకూ మెగా ఫ్యామిలీ మద్దతు తమకే అన్న ధీమాతో ఉన్నారు శివాజి రాజా. తాజాగా ఆయన నరేష్ ప్యానల్ కు మద్దతిస్తున్నట్లుగా తెలపడంతో డైలమాలో పడిపోయారు శివాజి రాజా. ఈరోజు ఉదయం 10గంటల నుంచి 2 గంటల వరకు మా ఎన్నికలు జరుగనున్నాయి. సాయంత్రం 5 గంటల నుండి ఓట్ల లెక్కింపు చేయనున్నారు.
గత ప్యానెల్‌లో చేసిన కార్యక్రమాలను కొనసాగిస్తామంటూ, కళాకారుల సంక్షేమం కోసం కొత్త హామీలు గుప్పించారు. తమను గెలిపిస్తే రూ.6 వేల పింఛన్‌తో పాటు కళాకారుల పిల్లల వివాహాలకు రూ.1,00,116 ఆర్థిక సాయం అందిస్తామని నరేశ్ ప్రకటించారు. తమను గెలిపిస్తే 50 మంది నటీనటులకు 6 నెలల పాటు నిత్యావసర సరుకులు ఉచితంగా అందిస్తామని, రూ.7,500 పింఛన్ ఇస్తామని శివాజీరాజా హామీ ఇచ్చారు. సర్వత్రా ఆసక్తి రేపుతున్న ఈ ఎన్నికల్లో సభ్యులు ఎవరికి పట్టం కడతారో తెలియాలంటే సాయంత్రం వరకూ వేచి చూడాల్సిందే.