శ్రీరెడ్డిపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది మా. ఆమెతో కలిసి నటిస్తే అభ్యంతరం లేదని మా అధ్యక్షుడు శివాజీ రాజా తెలిపారు. సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల్ని అడ్డుకునేందుకు కమిటీ ఎగెనెస్ట్ సెక్సువల్ హెరాస్‌మెంట్ (క్యాష్) పేరుతో బయటి వాళ్లతోనూ, చిత్ర పరిశ్రమ వ్యక్తులతోనూ కలిపి ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో మీడియాతో మాట్లాడిన శివాజీ రాజా నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు చిన్న కుమారుడు అభిరామ్,కొన వెంకట్‌లతో తమకు సంబంధం లేదని తెలిపారు.
కోన వెంకట్ తో మాకు సంబంధం లేదు.. రైటర్స్ అసోసియేషన్ అనేది ఉంది. ఆ విషయం వాళ్లు చూసుకుంటారు. ఇక అభిరామ్ నటుడు కాదు, నిర్మాత కాదు, మాకు సంబంధం లేని విషయం అని తెలిపారు. తెలుగు ఆర్టిస్టులను ప్రోత్సహించడం లేదని శ్రీరెడ్డి చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. తెలుగు ఆర్టిస్టులను టాలీవుడ్ ప్రోత్సహిస్తూనే ఉందని అన్నారు.
శ్రీరెడ్డి ఏ సహాయం కోరినా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ‘మా’ సభ్యత్వం అనేది మాత్రం కమిటీ నిర్ణయించాల్సిన విషయం అన్నారు. జెమినీ కిరణ్ మాట్లాడుతూ అవకాశాలు ఇవ్వడం, ఇవ్వకపోవడమనేది దర్శకనిర్మాతల ఇష్టం. నటులకి వేధింపులు ఎదురైతే మాత్రం క్యాష్ కమిటీ జోక్యం చేసుకుంటుంది అన్నారు.
నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ఈ కమిటీ మీద ఎవ్వరికీ అనుమానాలు అవసరం లేదు. పదిమంది పరిశ్రమకి చెందినవాళ్లు, పదిమంది బయటి వ్యక్తులు ఇందులో ఉంటారు. చిత్ర పరిశ్రమలో శ్రీరెడ్డి సమస్య ఒక్కటే కాదు, పరిష్కరించాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి అన్నారు.