లుంగీతో ఉపయోగాలు తెలుసా..ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నోరు తుడుచుకోడానికి కాగితం అక్కర్లేదు, చెయ్యి తుడుచుకోడానికి రుమాలక్ఖర్లేదు,ఒళ్ళు తుడుచుకోడానికి తువ్వాళఖ్ఖర్లేదు.గుడి లేని గుడ్డ లుంగీ.
ఎండాకాలం గాలికి, చలికాలం విప్పేసి కప్పుకోడానికి,వానాకాలం వెనకనుంచి నెత్తిమీద కప్పుకోడానికి ,ఋతువు లేని ఋజువు లుంగీది.
నిక్కరు కనిపించేలా కడితే బస్తా ఎత్తడానికి,మోకాళ్ళ వరకు కడితే వంట చెయ్యడానికి,చీల మండ వరకు వదిలేస్తే పెద్దరికం చెయ్యడానికి,ఉద్యోగాలని మించిన ఉనికి లుంగీది.
మలయాళీలు ఎగ్గట్టి మారథాన్ పరిగెట్టేస్తారు,తమిళులు మడిచి కత్తి దూస్తారు,తెలుగోళ్లు కాలితో ఎత్తి అంచు పట్టుకుని వెనక సుమోలు లేపేస్తారు,దక్షిణ భారత దమ్ము లుంగీది.
బస్తా ఎత్తిన తలపై తలపాగాలా,భారమైన బిందె కింద సుమ్మలా,పదునైన పేక కింద పరుపులా,చేదోడు వాదోడు లుంగీది.
బకెట్టులో మిగిలిన సబ్బునీళ్లలోనే స్నానం చేసి, బీరువాలో కదలని భారమైన చీరల అడుగున ఇస్త్రీ అయ్యి,తను చుట్టే నడుము ఎన్ని ఇంచీలని ఎంచని, త్యాగాల తనువు లుంగీది.
ఒకసారి చిరిగితే కుట్టించి వాడొచ్చు, ఇంకొన్ని సార్లు చిరిగితే ద్వారం దగ్గర పడెయ్యొచ్చు, ఇంకా చిరిగితే మసిగుడ్డ గా మార్చెయ్యొచ్చు ,
పునర్వినియోగ పద్ధతికి ముందు పుట్టిన చరిత్ర లుంగీది.
లుంగీని, దాన్ని కట్టిన వాళ్ళని చిన్న చూపు చూసిన వాళ్ళని, ఆ కాళోజి, “లుంగీకట్టుట రాదంచు సకిలించు తెలుగోడా చావెందుకురా”, అని
ఆ గురజాడ,”లుంగీ కట్టని వాడు దున్నపోతై పుట్టున్”, అని శపించేవారు. సంకలనాలు దాటిన సాహిత్యం లుంగీది.