హైదరాబాదీయులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న మెట్రోరైల్‌ను ఈ నెల 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్న విషయం తెలిసిందే. 29 నుంచే సాధారణ పౌరులకు మెట్రో రైలు ప్రయాణం అందుబాటులోకి రానుంది.
తాజాగా, మెట్రోస్మార్ట్ కార్డులు కూడా వచ్చేశాయ్. మెట్రోరైల్లో ప్రయాణించే వారి కోసం మెట్రోస్మార్ట్ కార్డులను ఈ రోజు (ఆదివారం) నుంచి విక్రయిస్తున్నారు. మొదట నగరంలోని నాగోల్, తార్నాక, ప్రకాశ్‌నగర్, ఎస్సార్‌నగర్ మెట్రో స్టేషన్లలో ఈ కార్డులను అమ్ముతున్నారు.
అయితే ఈ కార్డులు పొందిన వారు వాటితో ఫొటోలు దిగుతూ తెగ మురిసిపోతున్నారు. డెబిట్, క్రెడిట్ కార్డు సైజులోనే ఈ కార్డులు ఉన్నాయి. వీటిని ఉపయోగించి మెట్రోరైల్ ఛార్జీల్లో ఐదు శాతం డిస్కౌంట్ పొందవచ్చు.
ఈ మెట్రో స్మార్ట్‌కార్డు ధర రూ.200. అందులో రూ.100 ధరావతు కింది జమ అవుతుంది. మిగతా రూ.100 కార్డులో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ కార్డులో గరిష్ఠంగా రూ.2వేల వరకు రీఛార్జి చేసుకోవచ్చు. గడువు ముగిశాక తిరిగి రెన్యువల్ చేసుకోవచ్చు.