ఎక్కువసేపు కూర్చుంటే.. ఎన్ని ప్రమాదాలో ?

23
- Advertisement -

నేటి ఆధునిక యుగంలో గంటల తరబడి కంప్యూటర్ కు అతుక్కుపోయే వారి సంఖ్య చాలానే ఉంది. ఆఫీసుల్లో కూడా గంటల తరబడి కంప్యూటర్ ముందే కూర్చొని పని చేయాల్సి ఉంటుంది. ఇలా సమయాభావం లేకుండా ఎక్కువ సేపు కూర్చొని పని చేయడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇతరులతో పోల్చితే ఎక్కువ సేపు కూర్చుని పని చేసేవాళ్లే తొందరగా అనారోగ్య బారిన పడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. మధుమేహం, అల్జీమర్ వ్యాధి, ఆర్థరైటిస్, వెన్నునొప్పి, నడుం నొప్పి.. ఇలా ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయట. కంప్యూటర్ ముందు అలాగే కూర్చోవడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పెరుకుపోతుంది. తద్వారా వేగంగా బరువు పెరిగే అవకాశం ఉంది. ఇది ఊబకాయానికి కూడా దారి తీస్తుంది.

ఊబకాయం ఉన్నవారికి మధుమేహం త్వరగా ఎటాక్ అవుతుంది. తర్వాత దాని నుంచి బయట పడడం చాలా కష్టం. ఇక వేరే ఆలోచన లేకుండా గంటల తరబడి కూర్చొని పని చేయడం వల్ల మానసిక ఆందోళన, ఒత్తిడి కూడా పెరుగుతాయట. కాబట్టి ఎక్కువ సేపు కూర్చుని పని చేసే వారు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిత్యం కుర్చీలో కూర్చోకుండా ప్రతి 15 నిమిషాలకు ఒకసారి లేచి నడవాలి. ఇలా చేయడం వల్ల శరీర భాగాలు తిరిగి యాక్టివ్ దశలోకి వస్తాయి. కంప్యూటర్ తో పని చేసేటప్పుడు సమయం దొరికిన ప్రతిసారి తోటి వారితో సమయం గడపాలి.

ఇలా చేయడం వల్ల మైండ్ రిఫ్రెష్ గా మారుతుంది. తద్వారా మానసిక ఒత్తిడి దూరమవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఎక్కువసేపు కూర్చొని పని చేసే వారు ప్రతిరోజూ ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ అన్నీ భాగాలకు సవ్యంగా జరిగి వెన్ను నొప్పి, నడుం నొప్పి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. కాబట్టి కూర్చొని పని చేసేవాళ్ళు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటిస్తే ఎంతో మంచిది.

Also Read:Nivedha:నివేదా థామస్ పై బోల్డ్ కామెంట్స్!

- Advertisement -