గ్రేటర్ హైదరాబాద్‌లో మురికివాడలు, సమస్యాత్మక ప్రాంతాల్లో విస్తృతంగా ఫాగింగ్, స్ప్రేయింగ్ నిర్వహించడం, నగరంలోని 385 కిలోమీటర్ల నాలాల్లో లార్వా నిరోధక స్ప్రేయింగ్ చేయడం, అన్ని పర్యాటక ప్రాంతాలు, జనసాంద్రత అధికంగా ఉండే ప్రాంతాల్లో ఫాగింగ్‌ను మరింతగా చేపట్టాలని జిహెచ్ఎంసి నిర్ణయించింది. నేడు జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో ఎంటమాలజి విభాగం అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందితో జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
విజిలెన్స్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, చీఫ్ ఎంటమాలజి అధికారి రాంబాబు లు హాజరైన ఈ సమావేశంలో కమిషనర్ లోకేష్ కుమార్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో గత నెలను పోల్చితే ఈ నెలలో డెంగ్యు కేసులు దాదాపు మూడువంతుల కేసులు తగ్గాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం జిహెచ్ఎంసిలో ఉన్న 150 ఫాగింగ్ మిషన్ల సంఖ్యను 300లకు పెంచామని, ఈ ఫాగింగ్ మిషన్ల ద్వారా నగరంలోని అన్ని మురికివాడలు, సమస్యాత్మక ప్రాంతాల్లో విస్తృతంగా ఫాగింగ్ చేయాలని ఆదేశించారు. ప్రధానంగా నగరంలో ఉన్న 385 కిలోమీటర్ల విస్తీర్ణంలోని నాలాల్లో దోమల నివారణకు స్ప్రేయింగ్ చేయించాలని అన్నారు.
నవంబర్ మాసాంతంలోగా ప్రస్తుతం జిహెచ్ఎంసిలో ఉన్న పవర్ స్ప్రేయింగ్, ఫాగింగ్ మిషన్ల సంఖ్యను గణనీయంగా పెంచనున్నట్టు కమిషనర్ తెలిపారు. హైదరాబాద్ నగరంలోని ప్రాంతాలను హైరిస్క్ ఏరియాలు, సమస్యాత్మక ప్రాంతాలు కవర్ చేయని ప్రాంతాలుగా గుర్తించి ప్రణాళికాబద్దంగా ఈ ప్రాంతాల్లో స్ప్రేయింగ్, ఫాగింగ్ నిర్వహించాలని స్పష్టం చేశారు. ఎంటమాలజి విభాగానికి సిబ్బంది పెంచేందుకుగాను చర్యలు చేపట్టనున్నట్టు ఇందుకుగాను ఇతర విభాగాల్లో అధికంగా ఉన్న సిబ్బందిని కేటాయించే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. వాహనాలకు అమర్చిన ఫాగింగ్ మిషన్ల ద్వారా వారానికి కనీసం 9వేల కిలోమీటర్ల మేర ఫాగింగ్ నిర్వహించాలని తెలిపారు. ప్రతిరోజు ఫాగింగ్, స్ప్రేయింగ్ నిర్వహించే నివాసాలు, కాలనీల వివరాలతో కూడిన గణాంకాలను పకడ్బందీగా నిర్వహించాలని స్పష్టం చేశారు.