ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంత్రి నారా లోకేష్ కొత్త కార్యక్రమంతో ఆసక్తి రేపుతున్నారు. పార్టీ బలోపేతం, నాయకులతో ఆత్మీయ సంబంధాల పెంపు లక్ష్యంగా “ఫ్యామిలీ డిన్నర్ విత్ లోకేష్” అనే వినూత్న కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా టీడీపీ నేతలను వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్వానించి స్నేహపూర్వక వాతావరణంలో భోజనసమావేశాలు నిర్వహిస్తున్నారు.
తొలిరోజు బందరు లోక్సభ సెగ్మెంట్‌కు చెందిన పార్టీ నాయకులు, వారి కుటుంబాలతో కలిసి జరిగిన ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాజకీయ చర్చలకే పరిమితం కాకుండా, కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలిగి వారి అభిప్రాయాలు తెలుసుకోవడం ఈ సమావేశం ప్రత్యేకత. ఇది ఒక రాజకీయ సమావేశంలా కాకుండా కుటుంబ శుభకార్యంలా స్నేహపూర్వకంగా సాగింది.
పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులను గుర్తించి గౌరవించడం, వారి కుటుంబాల పాత్రను అభినందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. దీంతో నాయకుల్లో ఉత్సాహం పెరగడంతో పాటు, పార్టీకి మరింత ఐక్యత ఏర్పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇకపై ప్రతిరోజూ ఒక నియోజకవర్గానికి చెందిన నేతల కుటుంబాలతో “ఫ్యామిలీ డిన్నర్ విత్ లోకేష్” కార్యక్రమం నిర్వహించనున్నట్టు సమాచారం. ఈ కొత్త ఆలోచన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Also Read:పచ్చిగా కూరగాయలను తింటున్నారా?

