దేశవ్యాప్తంగా తొలిదశ పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలవైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. నిజామాబాద్ నియోజకవర్గంలో మాత్రం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
నిర్ణీత సమయంలోపు క్యూలైన్ల నిల్చున్న వారినే ఓటు వేసేందుకు అధికారులు అనుమతించనున్నారు. ఓటర్లు పోల్ స్లిప్‌తో పాటు ఏదో ఒక గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి. పోలింగ్ నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటుచేశారు. ఎన్నికల కోసం 145 కంపెనీల కేంద్ర బలగాలు మొహించారు. దాదాపు 3 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు.
తెలంగాణలో 17 లోక్‌సభ నియోజకవర్గాలకు 443 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. వీరిలో అత్యధికంగా నిజామాబాద్ నియోజకవర్గంలో 185 మంది, అత్యల్పంగా మెదక్ పార్లమెంటుకు 10 మంది పోటీ చేస్తున్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ మొత్తం 17 స్థానాల్లో అభ్యర్థులను నిలుపగా, ఎంఐఎం ఒక్క స్థానంలో బీఎస్పీ 5, సీపీఐ 2, సీపీఎం 2 స్థానాల్లో పోటీచేస్తున్నాయి. మొత్తంగా 25 మంది మహిళలు పోటీ పడుతుండగా స్వతంత్రులు 299 మంది బరిలో నిలబడ్డారు.