17వ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. జూన్ 3న ప్రస్తుత లోక్ సభ ముగియన్న తరుణంలో, మే నెలలో ఎన్నికలను నిర్వహించేందుకు ఈసీ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ సునీల్ అరోరా షెడ్యూల్‌ను విడుదల చేశారు. షెడ్యూలు ప్రకటించిన మరుక్షణం నుంచి దేశవాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.
లోక్ సభ 543 స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 175, ఒడిశా 147, సిక్కిం 32, అరుణాచల్ ప్రదేశ్ 60 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికలు ఏడు విడతల్లో జరుగనున్నట్లు సీఈసీ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 11న ఎన్నికలు జరుగనున్నాయి.
ఈ సందర్భంగా సీఈసీ సునీల్ ఆరోరా మాట్లాడుతూ.. జూన్ 3తో ప్రస్తుత లోక్‌సభ కాలపరిమితి ముగుస్తుందని, సార్వత్రిక ఎన్నికలకు ఈసీ సమగ్రమైన ఏర్పాట్లు చేసిందన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో సన్నాహక సమావేశాలు నిర్వహించాం. శాంతి భద్రతలు, బలగాల మోహరింపుపై సమగ్రమైన చర్చలు జరిపాం. దేశవ్యాప్తంగా పండుగలు, పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల తేదీలు నిర్ణయించాం. వాతావరణం, పంటకోతల సమయాలను కూడా పరిగణలోకి తీసుకున్నామని సునీల్ అరోరా తెలిపారు.
ఏడు విడతల్లో లోకసభ ఎన్నికలు…
మార్చి 18న మొదటి నొటిఫికేషన్ విడుదల.
ఏప్రిల్ 11న తొలి విడత లోక్ సభ ఎన్నికలు.
ఏప్రిల్ 18న రెండోదశ లోక్ సభ ఎన్నికలు.
ఏప్రిల్ 23న మూడో దశ లోక్ సభ ఎన్నికలు.
ఏప్రిల్ 29న నాలుగో దశ లోక్ సభ ఎన్నికలు.
మే 6న ఐదో దశ లోక్ సభ ఎన్నికలు.
మే 12న ఆరోదశ లోక్ సభ ఎన్నికలు.
మే 19న ఏడో దశ లోక్ సభ ఎన్నికలు.
మే 23న ఓట్ల లెక్కింపు, ఎన్నికల ఫలితాలు.