తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుకు ఆరుగురు అదనపు న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులిచ్చింది. వీరి నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ సంయుక్త కార్యదర్శి సోమవారం ప్రకటన జారీచేశారు. కొత్తగా నియమితులైన వారిలో కొంగర విజయలక్ష్మి, పి.కేశవరావు, ఎం.గంగారావు, డీవీఎ్‌సఎస్ సోమయాజులు, అభినంద్‌కుమార్ షావలి, టి.అమర్‌నాథ్‌గౌడ్ ఉన్నారు.
వీరి పేర్లను గతేడాది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సిఫారసు చేసింది. వీరు న్యాయవాదుల కోటాలో హైకోర్టు న్యాయమూర్తులుగా ఎంపికయ్యారు. మరోవైపు జస్టిస్ రాజా ఇళంగో ఈ నెల 22న, మరొక న్యాయమూర్తి వచ్చే నెలలో పదవీ విరమణ చేయనుండడం గమనార్హం.
కాగా..ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ కొత్తగా ఎంపికైన వారితో 21 లేదా 22న ప్రమాణం చేయించనున్నట్లు సమాచారం. హైకోర్టుకు మొత్తం 61 మంది న్యాయమూర్తుల పోస్టులు మంజూరవగా.. ప్రస్తుతం 27 మందే పనిచేస్తున్నారు. తాజాగా ఆరుగురి నియామకంతో న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరింది.