ప్రయాణంలో తొలి అడుగుకీ పుస్తకంలో తొలి పేజీకీ ప్రేమకి దారితీసిన తొలిచూపుకీ ఉండే ప్రాధాన్యమే వేరు. ఎన్నిరోజులైనా అవి గుర్తొస్తూనే ఉంటాయి. అలాంటి కొన్ని తొలి అనుభూతులు నా జీవితంలోనూ ఉన్నాయంటూ ఇలా మనసు విప్పింది సొట్టబుగ్గల లావణ్య త్రిపాఠి.
తనకు సంబంధించిన పలు విశేషాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. మిస్ ఉత్తరాఖండ్ గా గెలుపొందిన తరువాత సక్సెస్ పరిణామాలు అర్ధమయ్యాయని తెలిపింది. చాలామంది కెమెరా అనగానే భయపడతారని తాను మాత్రం అలా కాదని, కెమెరా ముందుకు రాగానే తాను లావణ్య అన్న విషయం మర్చిపోతానని తెలిపింది. పాత్ర మాత్రమే గుర్తుంటుందని, డైరెక్టర్ చెప్పింది మాత్రమే తాను గుర్తుంచుకుంటానని అంటుంది.
ఇంతవరకు తాను ముద్దు సన్నివేశాల్లో నటించే అవకాశం పెద్దగా రాలేదని తెలిపింది. సినిమాల పరంగా తన తొలి ముద్దును ‘భలే భలే మగాడివోయ్’ సినిమాలో నాని బుగ్గపై పెట్టిందేనని తెలిపింది. అలాగే సినిమాల్లో తన తొలి డైలాగ్ త్వరగానాకు పెళ్లి చేసెయ్యండి నాన్న అన్న డైలాగ్ అని చెప్పింది. మోడలింగ్ లో తొలిసారి ర్యాంప్ వాక్ చేసినప్పుడు 5,000 రూపాయలు పారితోషికం ఇచ్చారని దానిని తన తల్లికి ఇచ్చేశానని తెలిపింది. తన తొలి సినిమా పారితోషికం కూడా తనతల్లికి ఇచ్చేశానని ఆమె వెల్లడించింది.
అంతేకాదు థియేటర్లో తను చూసిన తొలి సినిమా ‘హమ్ ఆప్‌కే హై కౌన్’. అప్పుడు తన వయసు ఎంతో గుర్తు లేదని అమ్మానాన్నలతో కలిసి వెళ్లానని తెలిపింది. అందులో మాధురీదీక్షిత్ అందరికంటే ఎక్కువగా ఆకర్షించింది. ఇప్పటికీ ఆ సినిమా గుర్తుకొచ్చిందంటే మాధురి నా కళ్ల ముందు మెదులుతుంది. బహుశా ఆమె ప్రభావంతోనే కథానాయికనయ్యానేమో అంటుంది ఈ అందాల రాక్షసి.