శుక్రవారం రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నగరంలోని బీఆర్‌కేఆర్ భవన్‌లో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. 42 బ్యాంకుల అధికారులు సమావేశమైయ్యారు. రూ.50 వేల వరకు రైతు రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్యాంకు అధికారులతో మంత్రులు భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఆర్థిక, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, ఆయా బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. రూ. 50 వేల లోపు రైతు రుణ మాఫీపై క్యాబినెట్ సమావేశంలో సీఎం ఆదేశాల మేరకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆగష్టు 15 వ తేదీన సీఎం కేసీఆర్ లాంఛనంగా రూ. 50 వేలలోపు రైతు రుణాల మాఫీ ప్రకటిస్తారు. ఆగష్టు 16 వ తేదీ నుంచే ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 2,006 కోట్లు జమ అవుతాయి. బ్యాంకర్లు , ప్రభుత్వ అధికారులు సమన్వయంతో రైతుల ఖాతాల్లో రుణ మాఫీ మొత్తం జమ అయ్యేలా చూడాలి. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని బ్యాంకర్లకు సూచించారు.
రైతుల ఖాతాల్లో రుణ మాఫీ మొత్తం జమ అవగానే ముఖ్యమంత్రి పేరుతో రైతు రుణం మాఫీ అయినట్లు లబ్ధిదారుల ఫోన్లకు సందేశాలు వెళ్లాలన్నారు. రైతు రుణ మాఫీతో పాటు కొత్త పంట రుణానికి మీరు అర్హులని ఆ సందేశంలో తప్పకుండా పేర్కొనాలన్నారు. రైతుల ఖాతాల్లో జమ అయిన రుణ మాఫీ మొత్తాన్ని మరే ఇతర ఖాతా కింద జమ చేయవద్దన్నారు. రైతులకు ఇబ్బందులు సృష్టించవద్దన్నారు. రుణ మాఫీ లబ్దిదారులైన రైతుల ఖాతాలను జీరో చేసి కొత్త పంట రుణం ఇవ్వాలన్నారు.
మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతుల రుణ మాఫీ చెల్లింపుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ప్రభుత్వానికి అన్ని బ్యాంకులు సహకరించాలన్నారు. బ్యాంకులు ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా రైతులకు రుణ మాఫీ మొత్తం చేరేలా చూడాలన్నారు. వ్యవసాయ శాఖ తరుపున సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు.